Tech Layoffs 2025 : టెక్ ఉద్యోగులకు షాక్.. 2025లో 120,000 మందికిపైగా ఉద్యోగులకు గుడ్ బై
2025లో 120,000 మందికిపైగా ఉద్యోగులకు గుడ్ బై
Tech Layoffs 2025 : 2025వ సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా ఉన్న టెక్ పరిశ్రమ ఉద్యోగులకు తీరని నిరాశను మిగిల్చింది. ఈ ఏడాది ప్రపంచవ్యాప్తంగా టెక్ కంపెనీలలో భారీ స్థాయిలో ఉద్యోగాల కోతలు (లేఆఫ్స్) విధించడంతో, ఏకంగా 120,000 మందికి పైగా ఉద్యోగులు తమ ఉద్యోగాలను కోల్పోయారు. కంపెనీలు తమ ఖర్చులను తగ్గించుకోవడానికి, పనితీరు సరళిని పునర్నిర్మించుకోవడానికి అత్యంత ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వైపు తమ దృష్టిని మళ్లించడంపై దృష్టి సారించడంతో ఈ భారీ సంఖ్యలో లేఆఫ్స్ సంభవించాయి. చిప్ తయారీ సంస్థల నుంచి ఐటీ సర్వీస్ కంపెనీల వరకు, క్లౌడ్, టెలికాం కంపెనీల వరకు పలు టెక్నాలజీ రంగాల్లో ఈ ఉద్యోగాల కోతలు స్పష్టంగా కనిపించాయి.
ఉద్యోగులను తొలగించిన కంపెనీల్లో సెమీకండక్టర్ దిగ్గజం ఇంటెల్ మొదటి స్థానంలో నిలిచింది. ఖర్చులను అదుపు చేయడానికి ఫౌండ్రీ-కేంద్రీకృత వ్యాపార నమూనాను మార్చుకోవడానికి ఇంటెల్ దాదాపు 24,000 మంది ఉద్యోగులను తొలగించింది. ఇంటెల్ తర్వాత దేశీయ ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ రెండో స్థానంలో నిలిచింది. టీసీఎస్ దాదాపు 20,000 మంది ఉద్యోగులను తొలగించడానికి నైపుణ్యాల కొరత, AI ఆధారిత డెలివరీ మోడల్‌ను ఎక్కువగా ఉపయోగించడం వంటి కారణాలను చూపింది. టెలికాం దిగ్గజం వెరిజోన్ కూడా ఖర్చులను తగ్గించుకోవడానికి, కార్యకలాపాలను పునర్నిర్మించడంలో భాగంగా దాదాపు 15,000 ఉద్యోగాలను రద్దు చేసింది.
ఈ లేఆఫ్స్ జాబితాలో ప్రముఖ దిగ్గజాలైన అమెజాన్ పేరు కూడా ఉంది. ఈ ఈ-కామర్స్ దిగ్గజం సుమారు 14,000 మేనేజ్‌మెంట్, అడ్మినిస్ట్రేటివ్ పాత్రలను రద్దు చేసింది. డెల్ టెక్నాలజీస్ కూడా ఖర్చుల నిర్వహణ, AI-ఆప్టిమైజ్డ్ హార్డ్‌వేర్ వైపు మళ్లడం కోసం తమ మొత్తం ఉద్యోగుల్లో దాదాపు 12,000 మందిని తొలగించింది. ఇతర ప్రముఖ కంపెనీల్లో కూడా భారీ కోతలు కనిపించాయి..యాక్సెంచర్ (11,000), ఎస్‌ఏపీ (10,000), మైక్రోసాఫ్ట్ (9,000), తోషిబా (5,000), సిస్కో (4,250) వంటి సంస్థలు తమ తమ విభాగాలలో ఉద్యోగులను తగ్గించుకొని, జనరేటివ్ AI, క్లౌడ్ కంప్యూటింగ్ వంటి కొత్త టెక్నాలజీలపై పెట్టుబడులు పెట్టడానికి ప్రాధాన్యత ఇచ్చాయి. ఈ భారీ సంఖ్యలో జరిగిన లేఆఫ్స్ టెక్ ప్రపంచంలో పెరుగుతున్న ఆటోమేషన్, ఆర్ధిక అనిశ్చితిని స్పష్టం చేస్తున్నాయి.