Tesla : టెస్లా కళ్లు చెదిరే గిఫ్ట్.. ఎలన్ మస్క్‌కి 2.4 లక్షల కోట్లు ఎందుకు ఇస్తున్నారు?
ఎలన్ మస్క్‌కి 2.4 లక్షల కోట్లు ఎందుకు ఇస్తున్నారు?;
Tesla : టెస్లా కంపెనీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్.. కంపెనీ సీఈఓ అయిన ఎలన్ మస్క్‌కి 96 మిలియన్ షేర్లను గిఫ్ట్‌గా ఇవ్వాలని నిర్ణయించింది. ఈ షేర్ల విలువ దాదాపు 29 బిలియన్ డాలర్లు అంటే, మన భారతీయ కరెన్సీలో సుమారు రూ.2.4 లక్షల కోట్లు. ఈ నిర్ణయం నవంబర్ 6న జరగబోయే కంపెనీ వార్షిక సమావేశానికి ముందే తీసుకోవడం విశేషం. ఈ వార్త బయటికి రాగానే, సోమవారం టెస్లా షేర్లు 2.6% పెరిగాయి. మార్కెట్‌లో కొంత కదలిక కనిపించింది.
మస్క్‌కి ఎందుకింత పెద్ద బహుమతి?
ఎలన్ మస్క్ 2008 నుంచి టెస్లా సీఈఓగా పనిచేస్తున్నారు. ఇప్పుడు ఆయనకు ఇచ్చిన 96 మిలియన్ షేర్ల గిఫ్ట్, కంపెనీపై ఆయనకున్న పట్టును మరింత బలపరుస్తుంది. ఈ షేర్ల వల్ల భవిష్యత్తులో కంపెనీలో మస్క్ ఆధిపత్యం మరింత పెరుగుతుందని బోర్డు చెబుతోంది. టెస్లాకు సంబంధించిన ఒక ప్రత్యేక కమిటీ.. మస్క్ కంపెనీ దీర్ఘకాలిక ప్రణాళికలు, లక్ష్యాలపై మరింత దృష్టి పెట్టడానికి ఈ బహుమతి అవసరమని చెప్పింది. ఈ కమిటీలో టెస్లా చైర్‌పర్సన్ రాబిన్ డెన్‌హోల్మ్, ఇండిపెండెంట్ డైరెక్టర్ కాథ్లీన్ విల్సన్-థాంప్సన్ ఉన్నారు.
ఈ గిఫ్ట్‌కి కొన్ని షరతులు
ఈ షేర్లను ఇచ్చేటప్పుడు బోర్డు కొన్ని షరతులు పెట్టింది. 2027 వరకు ఎలన్ మస్క్ టెస్లా సీఈఓగా ఉంటేనే, ఆయనకు ఈ 96 మిలియన్ షేర్లు పూర్తిగా లభిస్తాయి. అంతేకాకుండా, ఈ షేర్లు పొందిన తర్వాత మస్క్ వాటిని ఐదేళ్ల వరకు అమ్మకూడదు. పన్నులు చెల్లించడానికి లేదా 2018 నాటి అవార్డు ప్రకారం ఒక్కో షేరుకు 23.34డాలర్ల ధర చెల్లించడానికి మాత్రమే ఈ షేర్లను అమ్మడానికి అనుమతి ఉంటుంది. ఒకవేళ డెలావేర్ కోర్టు మస్క్ 2018 సీఈఓ అవార్డును తిరిగి పూర్తిగా ఆమోదిస్తే, ఈ కొత్త గిఫ్ట్ రద్దవవచ్చు లేదా దాని విలువ తగ్గించవచ్చు. అంటే, మస్క్‌కి ఒకే విషయానికి రెండుసార్లు లాభం రాకుండా చూస్తుంది టెస్లా.
గతంలో రద్దయిన 50 బిలియన్ డాలర్ల ప్యాకేజీ
ఈ ఏడాది ప్రారంభంలో డెలావేర్ కోర్టు మస్క్‌కు గతంలో ఇచ్చిన 50 బిలియన్ డాలర్ల కంటే ఎక్కువ విలువైన ప్యాకేజీని రద్దు చేసింది. బోర్డు సరైన పద్ధతిలో పని చేయలేదని, పెట్టుబడిదారులకు న్యాయం జరగలేదని కోర్టు తెలిపింది. ఈ నిర్ణయం తప్పు అని మస్క్ మార్చిలో కోర్టులో అప్పీల్ చేశారు. కింది కోర్టు చట్టాన్ని తప్పుగా అర్థం చేసుకుందని ఆయన వాదించారు.