LPG Journey : పొయ్యి నుంచి సిలిండర్ దాకా.. 25 ఏళ్లలో మీ వంటగది ఎలా మారిందో తెలుసా?

25 ఏళ్లలో మీ వంటగది ఎలా మారిందో తెలుసా?

Update: 2025-12-23 07:44 GMT

 LPG Journey : ఒకప్పుడు పట్టణాలకే పరిమితమైన ఎల్‌పీజీ గ్యాస్ ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల వంటశాలల్లోనూ సాధారణమైంది. గత పాతికేళ్లలో దేశంలోని కోట్లాది మంది మహిళలు మట్టి పొయ్యిలు, కట్టెలు, బొగ్గుల పొగ నుంచి విముక్తి పొంది, ఎల్‌పీజీ సిలిండర్‌తో శుభ్రమైన, సురక్షితమైన, సౌకర్యవంతమైన వంట చేసుకుంటున్నారు. ఈ మార్పు కేవలం ప్రభుత్వ సంక్షేమ పథకాల విజయమే కాకుండా, సామాజిక దృక్పథంలో వచ్చిన పరివర్తనకు కూడా నిదర్శనం. అయితే, ఈ పాతికేళ్ల కాలంలో ఎల్‌పీజీ సిలిండర్ ధరలు మాత్రం ఆకాశాన్ని తాకాయి. 25 ఏళ్ల క్రితం ఉన్న ధరతో పోలిస్తే నేడు ఎన్నో రెట్లు పెరగడం వినియోగదారులపై ఆర్థిక భారాన్ని పెంచింది.

ఎల్‌పీజీ సిలిండర్ ధరలు గత 25 ఏళ్లలో అనూహ్యంగా పెరిగాయి.

1989 - 2000 వరకు: న్యూ ఇండియన్ ఎక్స్‌ప్రెస్ నివేదిక ప్రకారం.. 1989లో 14.2 కిలోల ఎల్‌పీజీ సిలిండర్ ధర కేవలం రూ.57.60 ఉండేది. కానీ 2000 సంవత్సరం వచ్చేసరికి ధరలు ఒక్కసారిగా పెరిగి రూ.232.25 కు చేరాయి.

2001 - 2010 మధ్య: ఈ దశాబ్దంలో ధరలలో కొంత హెచ్చుతగ్గులు కనిపించాయి. 2009లో ధర రూ.346.30కి పెరిగినా, వెంటనే తగ్గి రూ.279.70కి చేరి పౌరులకు కొంత ఉపశమనం ఇచ్చింది. కానీ 2010లో మళ్లీ ధరలు పెరిగి రూ.345.35 కు చేరుకున్నాయి.

2011 - 2025 వరకు భారీ పెరుగుదల: 2011 తర్వాత ఎల్‌పీజీ ధరలు వేగంగా పెరిగాయి. 2014లో ధర రూ.1241 కి చేరింది. అయితే 2015-16లో సబ్సిడీల సర్దుబాటు కారణంగా రూ. 606కి తగ్గింది. కోవిడ్ తర్వాత మళ్లీ పెరిగి, 2024-25లో ఢిల్లీలో సుమారు రూ.803-853 వద్ద స్థిరపడింది. ప్రస్తుతం గుడ్ రిటర్న్స్ డేటా ప్రకారం 14.2 కిలోల ఎల్‌పీజీ సిలిండర్ ధర రూ.852.50 ఉంది. అంటే, 25 ఏళ్లలో ధరలు 4 నుంచి 5 రెట్లు పెరిగాయి.

ధరల పెరుగుదల ప్రభావం సామాన్యులపై పడకుండా ఉండటానికి, ప్రభుత్వం ఎప్పటికప్పుడు సబ్సిడీలు, సంక్షేమ పథకాలు అమలు చేసింది. ముఖ్యంగా ఉజ్వల యోజన పేద, మధ్యతరగతి వర్గాలకు శుభ్రమైన ఇంధనాన్ని అందించడంలో కీలక పాత్ర పోషించింది. అలాగే, డైరెక్ట్ బ్యాంక్ ట్రాన్స్‌ఫర్ సదుపాయం ద్వారా సబ్సిడీ డబ్బును నేరుగా లబ్ధిదారుల ఖాతాలకు బదిలీ చేయడం వల్ల పారదర్శకత పెరిగింది. ఈ పథకాలు వంటగదిలో ఆరోగ్యకరమైన మార్పును తీసుకురావడంతో పాటు, పెరుగుతున్న ధరల భారాన్ని కొంతవరకు తగ్గించడంలో సహాయపడ్డాయి. ఈ లెక్కలు, విధానాలు, వాస్తవ పరిస్థితులను అర్థం చేసుకుంటేనే గత పాతికేళ్లలో వంటగదిలో వచ్చిన మార్పు స్పష్టంగా అర్థమవుతుంది.

Tags:    

Similar News