Zoho : బ్రాహ్మణ కుటుంబంలో పుట్టి నేడు రూ.50,000 కోట్లకు అధిపతి.. జోహో మెయిల్ వ్యవస్థాపకుడి షాకింగ్ జర్నీ
జోహో మెయిల్ వ్యవస్థాపకుడి షాకింగ్ జర్నీ
Zoho : భారతీయ సాఫ్ట్‌వేర్ సంస్థ జోహో ప్రస్తుతం వార్తల్లో నిలుస్తోంది. ఈ సంస్థకు చెందిన మెసేజింగ్ యాప్ అరట్టై ఇప్పుడు వాట్సాప్‌కు స్ట్రాంగ్ కాంపిటేటర్ గా మారింది. అదేవిధంగా ప్రైవసీ, ఉచిత సేవలు, వృత్తిపరమైన ఫీచర్ల కారణంగా చాలా మంది వినియోగదారులు జీమెయిల్‌ను వదిలి జోహో మెయిల్‌ను ఉపయోగించడం ప్రారంభించారు. ఇటీవల, కేంద్ర హోం మంత్రి అమిత్ షా కూడా తాను జోహో మెయిల్‌కు మారినట్లు సోషల్ మీడియాలో ప్రకటించడంతో జోహో వ్యవస్థాపకుడు శ్రీధర్ వేంబు గురించి తెలుసుకోవాలనే ఆసక్తి మరింత పెరిగింది.
శ్రీధర్ వేంబు ఎవరు?
శ్రీధర్ వేంబు 1968లో జన్మించారు. ఆయన భారతదేశపు ప్రముఖ పారిశ్రామికవేత్త, జోహో కార్పొరేషన్ వ్యవస్థాపకుడు. 2024 ఫోర్బ్స్ జాబితా ప్రకారం, ఆయన భారతదేశంలోని 39వ అత్యంత సంపన్నుడు. ఆయన మొత్తం సంపద దాదాపు 5.85 బిలియన్ డాలర్లు (సుమారు రూ.50,000 కోట్లు). దేశానికి చేసిన సేవలకు గుర్తింపుగా భారత ప్రభుత్వం ఆయనను 2021లో పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది.
శ్రీధర్ వేంబు తమిళనాడులోని తంజావూరు జిల్లాకు చెందిన ఒక చిన్న బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. ఆయన మద్రాస్ ఐఐటీ నుంచి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ పూర్తి చేసి, ఆ తర్వాత అమెరికాలోని ప్రిన్స్‌టన్ విశ్వవిద్యాలయం నుంచి మాస్టర్స్, పీహెచ్‌డీ పట్టాలను పొందారు. ఆయన వృత్తి జీవితం క్వాల్కామ్ లో వైర్‌లెస్ ఇంజనీర్‌గా ప్రారంభమైంది. 1996లో ఆయన తన సోదరులతో కలిసి అడ్వెంట్‌నెట్ అనే సంస్థను స్థాపించారు, దీనికి తర్వాత జోహో కార్పొరేషన్ అని పేరు మార్చారు. ఈ సంస్థ నేడు ప్రపంచవ్యాప్తంగా క్లౌడ్ సాఫ్ట్‌వేర్, కస్టమర్ సంబంధాల నిర్వహణ సొల్యూషన్స్ తో పాపులర్ అయింది.
2019లో శ్రీధర్ వేంబు ఒక విప్లవాత్మక నిర్ణయం తీసుకున్నారు. ఆయన చెన్నై, అమెరికా నగర జీవితాన్ని వదిలిపెట్టి తమిళనాడులోని తెన్కాసి అనే చిన్న గ్రామంలో స్థిరపడాలని నిర్ణయించుకున్నారు. అప్పటి నుంచి ఆయన అక్కడి నుంచే తమ వ్యాపారాన్ని నిర్వహిస్తున్నారు. టెక్నాలజీ, గ్రామాభివృద్ధి చేయి చేయి కలిపి సాగాలని ఆయన బలంగా నమ్ముతారు. ప్రస్తుతం శ్రీధర్ వేంబుకు జోహో సంస్థలో 88% వాటా ఉంది. కొద్ది సంవత్సరాలలోనే ఆయన సంపద రెట్టింపు కంటే ఎక్కువ పెరిగింది. డబ్బు లేదా సౌకర్యాల కంటే ఆలోచన, దృక్పథం నుంచే నిజమైన ఆనందం వస్తుందని ఆయన జీవిత కథ నిరూపిస్తుంది.