Donald Trumph : ట్రంప్ ఒకే ఒక్క నిర్ణయంతో మస్క్, జుకర్‌బర్గ్, బెజోస్‌లకు భారీ నష్టం
మస్క్, జుకర్‌బర్గ్, బెజోస్‌లకు భారీ నష్టం;
Donald Trumph : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న ఒక నిర్ణయం ప్రపంచవ్యాప్తంగా వ్యాపార ప్రపంచాన్ని కుదిపేసింది. దాదాపు 70 దేశాలపై కొత్త సుంకాలను విధించడంతో అమెరికన్ స్టాక్ మార్కెట్లు ఒక్కసారిగా కుప్పకూలాయి. దీని ఫలితంగా ప్రపంచంలోని కుబేరులైన ఎలాన్ మస్క్, జెఫ్ బెజోస్, మార్క్ జుకర్‌బర్గ్ వంటి ప్రముఖ వ్యాపారవేత్తల సంపద కొన్ని గంటల్లోనే లక్షల కోట్లకు పడిపోయింది.
అమెరికా అధ్యక్షుడు ఆగస్టు 1న పలు దేశాల నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై టారిఫ్‌లను పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయం స్టాక్ మార్కెట్‌పై తీవ్ర ప్రభావం చూపింది. భారత కాలమానం ప్రకారం అమెరికన్ మార్కెట్లు తెరుచుకున్న వెంటనే, డావ్ జోన్స్, S&P 500, నాస్‌డాక్ వంటి ప్రధాన సూచీలు భారీగా పడిపోయాయి. ఒకే రోజులో ఈ సూచీలు పడిపోవడంతో అనేక కంపెనీల షేర్ల విలువ తగ్గింది. దీనివల్ల ప్రముఖ బిలియనీర్ల సంపద కూడా ఒక్కసారిగా పడిపోయింది.
బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్ ఇండెక్స్ ప్రకారం.. ప్రపంచంలో అత్యంత ధనవంతుడు ఎలాన్ మస్క్ సంపద ఒకే రోజులో $4 బిలియన్లు తగ్గి $352 బిలియన్లకు చేరింది. అయితే, అత్యధిక నష్టం మాత్రం జెఫ్ బెజోస్‌కు జరిగింది. ఒకే రోజులో ఆయన సంపద $18 బిలియన్లు తగ్గింది. అలాగే, మార్క్ జుకర్‌బర్గ్‌కు $8 బిలియన్లు, లారీ ఎల్లిసన్‌కు $10 బిలియన్లు నష్టం జరిగింది.
ట్రంప్ నిర్ణయం వల్ల అమెరికన్ షేర్ మార్కెట్లు పడిపోవడంతో ఎలాన్ మస్క్ కంపెనీ టెస్లా షేర్లు కూడా భారీగా పడిపోయాయి. నాస్‌డాక్‌లో లిస్ట్ అయిన టెస్లా షేర్లు దాదాపు 2% పడిపోయి ఒక్కో షేరు 302.63డాలర్లకి చేరింది. ఒకే రోజులో టెస్లా షేర్ విలువ 5.64డాలర్లు తగ్గింది. అంతేకాకుండా, గత ఐదు రోజుల్లో టెస్లా షేర్ల విలువ దాదాపు 5% తగ్గడం గమనార్హం.