Donald Trumph : ట్రంప్ షాక్: అమెరికాలో మందుల ధరలు భగ్గుమంటాయా?

మందుల ధరలు భగ్గుమంటాయా?;

Update: 2025-07-31 11:58 GMT

Donald Trumph : భారతదేశంపై అమెరికా విధించిన 25% సుంకం దేశంలోని అనేక రంగాలపై ప్రభావం చూపుతుంది. అయితే, దీని ప్రభావం ఫార్మా రంగంలో అమెరికాపైనే ఎక్కువగా పడుతుందని తెలుస్తోంది. ఆగస్టు 1 నుండి భారతదేశం నుండి వచ్చే అన్ని ఉత్పత్తులపై 25 శాతం సుంకం విధించాలనే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిర్ణయం అమెరికాలో అవసరమైన మందుల ధరలను పెంచుతుందని ఇండియన్ ఫార్మాస్యూటికల్ ఎక్స్‌పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ పేర్కొంది. ఈ సుంకం వల్ల రాబోయే కాలంలో అమెరికా వినియోగదారులు, ఆరోగ్య రంగానికి నష్టం వాటిల్లుతుందని అంచనా.

ఫార్మెక్సిల్ ఛైర్మన్ నమిత్ జోషి ఒక ప్రకటనలో మాట్లాడుతూ.. "అమెరికా మార్కెట్ మందుల తయారీకి కావాల్సిన ముడిసరుకు, తక్కువ ఖర్చుతో కూడిన జెనరిక్ మందుల కోసం భారత్‌పై చాలా ఆధారపడి ఉంది. భారత్ అందించే విస్తృత స్థాయి, క్వాలిటీతో సరితూగే ప్రత్యామ్నాయ మార్గాలను కనుగొనడం అమెరికాకు చాలా కష్టం" అని అన్నారు.

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారతదేశంపై ఈ సుంకాన్ని ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం పై చర్చలు జరుగుతున్న సమయంలో ప్రకటించారు. ఈ సుంకం చర్చలలో వచ్చిన కొన్ని అడ్డంకులకు సంకేతంగా భావిస్తున్నారు. అంతేకాకుండా, రష్యా నుండి సైనిక పరికరాలు, చమురు కొనుగోలు చేసినందుకు అదనపు జరిమానా విధించాలని కూడా ట్రంప్ నిర్ణయించారు. అమెరికా తన డిమాండ్లను నెరవేర్చుకోవడానికి భారతదేశంపై ఈ సుంకాన్ని విధించిందని భావిస్తున్నారు.

ఫార్మెక్సిల్ ఛైర్మన్ మాట్లాడుతూ.. "భారత్ చాలా కాలంగా ప్రపంచానికి నాణ్యమైన మందులను అందిస్తోంది. అమెరికా తన జెనరిక్ మందుల మొత్తం అవసరాలలో 47% భారత్ నుంచే దిగుమతి చేసుకుంటుంది" అని చెప్పారు. భారతీయ ఔషధ కంపెనీలు ప్రాణాలను రక్షించే క్యాన్సర్ మందులు, యాంటీబయాటిక్స్, దీర్ఘకాలిక వ్యాధుల చికిత్సకు అవసరమైన మందులను తక్కువ ధరలకు అందించడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయని ఫార్మెక్సిల్ తెలిపింది. ఈ సరఫరా గొలుసులో ఏదైనా అంతరాయం మందుల కొరతకు, వాటి ధరలు పెరగడానికి దారితీస్తుంది. ఇది అమెరికా వినియోగదారులు, ఆరోగ్య సేవల రంగానికి తీవ్ర నష్టం కలిగిస్తుంది.

Tags:    

Similar News