UPI : యూపీఐ వాడుతున్నారా? నేటి నుంచి కొత్త రూల్స్! మీ డబ్బు ఇక క్షణాల్లో వాపస్
నేటి నుంచి కొత్త రూల్స్! మీ డబ్బు ఇక క్షణాల్లో వాపస్;
UPI : డిజిటల్ చెల్లింపుల విషయంలో నిత్యం కొత్త ఆవిష్కరణలతో దూసుకుపోతుంది భారతదేశం. యూపీఐ లావాదేవీలకు సంబంధించి వినియోగదారులకు శుభవార్త. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నేటి నుండి యూపీఐ లావాదేవీలకు సంబంధించిన సవరించిన ఛార్జ్‌బ్యాక్ నియమాలను అమలులోకి తెస్తోంది. ఈ కొత్త నిబంధనలతో ఇకపై చెల్లింపులకు సంబంధించిన వివాదాలకు వేగంగా పరిష్కారం లభిస్తుంది. ముఖ్యంగా, మీ బ్యాంక్ ఖాతా నుండి డబ్బు కట్ అయి, ట్రాన్షాక్షన్ ఫెయిల్ అయిన సందర్భాల్లో ఈ కొత్త నియమాలు చాలా ఉపయోగపడతాయి. ఇకపై మీ రీఫండ్ చాలా త్వరగా మీ చేతికి అందుతుంది.
ఛార్జ్‌బ్యాక్ అంటే ఏమిటి?
యూపీఐ వినియోగదారులు ఒక వ్యక్తికి లేదా వ్యాపారానికి డబ్బు పంపినప్పుడు, వారి బ్యాంక్ ఖాతా నుండి డబ్బు కట్ అయినప్పటికీ, గ్రహీతకు ఆ డబ్బు చేరకపోవచ్చు. ఇలాంటి సందర్భాలు చాలానే ఉన్నాయి. ట్రాన్సాక్షన్ ఫెయిల్ అని ముగిసే సంఘటనలు కూడా చాలానే జరుగుతాయి. ఇలాంటి పరిస్థితుల్లో, బ్యాంక్ ఖాతా నుండి కట్ అయిన డబ్బును తిరిగి చెల్లించమని అభ్యర్థిస్తూ ఛార్జ్‌బ్యాక్ రిక్వెస్ట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ అభ్యర్థన ద్వారా వినియోగదారులు తమ డబ్బును తిరిగి పొందడానికి అవకాశం ఉంటుంది.
గతంలో యూపీఐ వినియోగదారులు ఛార్జ్‌బ్యాక్ రిక్వెస్ట్ చేసినప్పుడు, ఆ సమస్య పరిష్కారం కావడానికి ఐదు లేదా ఆరు రోజులు పట్టేది. కానీ ఇప్పుడు కొత్త నియమాల ప్రకారం ఒకటి లేదా రెండు రోజుల్లోనే సమస్యకు పరిష్కారం లభించేలా నిబంధనలు రూపొందించబడ్డాయి. ఛార్జ్‌బ్యాక్ రిక్వెస్ట్ వచ్చినప్పుడు, బ్యాంక్‌లు గతంలో యూపీఐ రెఫరెన్స్ కంప్లైంట్ సిస్టమ్ ద్వారా NPCIకి వైట్‌లిస్ట్ చేయమని అభ్యర్థించాల్సి వచ్చేది. మొత్తం ప్రక్రియలో ఈ పద్ధతిని ఇప్పుడు తొలగించారు. బ్యాంక్‌లు ఇప్పుడు నేరుగా ఈ సమస్యలను పరిష్కరించడానికి కంప్లీట్ ఫ్రీడమ్ ఉంటుంది.
ఒక వ్యక్తికి డబ్బు పంపడంలో ఫెయిల్ అయితే రీఫండ్ చేయడానికి బ్యాంక్‌లకు ఒక రోజు సమయం ఇస్తారు. ఉదాహరణకు, మీరు ఈరోజు ఫిర్యాదు చేస్తే, రేపటిలోగా ఈ వివాదం పరిష్కారం కావాలి. వ్యాపారులకు చేసిన చెల్లింపులు విఫలమైనప్పుడు రీఫండ్ ఇవ్వడానికి రెండు రోజుల సమయం ఇవ్వబడుతుంది. ఇది వినియోగదారులకు మరింత భద్రతను, విశ్వాసాన్ని అందిస్తుంది.