UPI : భారత డిజిటల్ పేమెంట్స్‌లో యూపీఐదే రాజ్యం.. ఆర్బీఐ రిపోర్ట్‌లో సంచలన విషయాలు

ఆర్బీఐ రిపోర్ట్‌లో సంచలన విషయాలు

Update: 2025-10-24 08:06 GMT

UPI : భారతదేశంలో డిజిటల్ పేమెంట్స్ విప్లవాన్ని తీసుకొచ్చిన యూపీఐ ఇప్పుడు రిటైల్ ఫాస్ట్ పేమెంట్స్ రంగంలో తిరుగులేని రాజుగా అవతరించింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విడుదల చేసిన తాజా పేమెంట్స్ సిస్టమ్స్ రిపోర్ట్ ఈ విషయాన్ని స్పష్టం చేసింది. యూపీఐ లావాదేవీల సంఖ్య 2019 నుంచి 2024 మధ్య ఏకంగా వేల కోట్లకు పెరగగా, లావాదేవీల విలువ కూడా రికార్డు స్థాయిలో పెరిగింది. ముఖ్యంగా, చిన్న, రోజువారీ చెల్లింపుల కోసం యూపీఐ ఎంతగా ఉపయోగపడుతోందో, దాని గణాంకాలు, ఇతర ముఖ్య చెల్లింపు పద్ధతుల వివరాలను తెలుసుకుందాం.

ఆర్బీఐ తాజా నివేదిక ప్రకారం.. యూపీఐ దేశంలో అత్యంత ఎక్కువగా ఉపయోగించే రిటైల్ ఫాస్ట్ పేమెంట్ సిస్టమ్‌గా నిలిచింది. యూపీఐ లావాదేవీల సంఖ్య 2019లో కేవలం 1,079 కోట్ల నుంచి 2024 నాటికి భారీగా పెరిగి 17,221 కోట్ల లావాదేవీలకు చేరుకుంది. అంటే, ఐదేళ్లలో లావాదేవీల సంఖ్య సుమారు 16 రెట్లు పెరిగింది. లావాదేవీల మొత్తం విలువ కూడా 2019లో ఉన్న రూ.18.4 లక్షల కోట్ల నుంచి 2024 నాటికి ఏకంగా రూ.246.8 లక్షల కోట్లకు పెరిగింది.

గత ఏడాది కాలంలో యూపీఐ మరింత వేగంగా వృద్ధి చెందింది. 2024 క్యాలెండర్ సంవత్సరం మొదటి ఆరు నెలల్లో మొత్తం యూపీఐ లావాదేవీలు 117 కోట్ల నుంచి 2025 క్యాలెండర్ సంవత్సరం మొదటి ఆరు నెలల్లో 143 కోట్లకు పెరిగాయి. ఇది లావాదేవీల సంఖ్యలో 22% వృద్ధిని సూచిస్తుంది. యూపీఐ ద్వారా జరిగిన మొత్తం పేమెంట్స్ విలువ కూడా 34.7% పెరిగి, రూ.7,897.1 లక్షల కోట్ల నుంచి రూ.10,637 లక్షల కోట్లకు చేరుకుంది.

2025 మొదటి ఆరు నెలల్లో జరిగిన మొత్తం లావాదేవీలలో యూపీఐ వాటా ఏకంగా 84.8 శాతంగా ఉంది. సులభంగా వాడటం, వేగంగా ఉండటం, 24 గంటలు అందుబాటులో ఉండటం యూపీఐ ఇంతగా ప్రాచుర్యం పొందడానికి ముఖ్య కారణాలు. యూపీఐ లావాదేవీల సంఖ్యలో అగ్రస్థానంలో ఉన్నప్పటికీ, పెద్ద మొత్తంలో జరిగే లావాదేవీల విషయంలో ఇతర పద్ధతులు ఆధిపత్యం చెలాయిస్తున్నాయి.

రియల్-టైమ్ గ్రాస్ సెటిల్‌మెంట్‎లో కనీసం రూ.2 లక్షల లావాదేవీలు జరుగుతాయి. లావాదేవీల సంఖ్యలో ఇది కేవలం 0.1% మాత్రమే ఉన్నా, మొత్తం చెల్లింపుల విలువలో మాత్రం 68.7% వాటాను కలిగి ఉంది. అంటే పెద్ద పెద్ద లావాదేవీలకు ఇదే కీలకం. యూపీఐ లావాదేవీల మొత్తం విలువ, మొత్తం చెల్లింపుల విలువలో కేవలం 9.1% మాత్రమే ఉంది.

నెఫ్ట్ లావాదేవీల సంఖ్యలో 3.9% వాటా, విలువలో 15.1% వాటాను కలిగి ఉంది. ఇక కార్డుల ద్వారా జరిగే చెల్లింపులు సంఖ్యలో 2.7% మరియు విలువలో 0.8% గా ఉన్నాయి. చెక్కులు సంఖ్యలో 0.2%, విలువలో 2.3% ఉన్నాయి. ఈ ఆర్బీఐ నివేదిక ద్వారా స్పష్టంగా తెలిసేదేమంటే, చిన్న రోజువారీ లావాదేవీలలో యూపీఐ ఆదరణ విపరీతంగా పెరిగింది. అయితే, పెద్ద మొత్తంలో జరిగే ఆర్థిక లావాదేవీల విషయంలో మాత్రం ఆర్‌టీజీఎస్, నెఫ్ట్ లే ముఖ్య పాత్ర పోషిస్తున్నాయి.

Tags:    

Similar News