US National Debt : అప్పుల ఊబిలో అమెరికా..2028 నాటికి పరిస్థితి ఎలా ఉండబోతోంది?

2028 నాటికి పరిస్థితి ఎలా ఉండబోతోంది?

Update: 2025-11-15 06:12 GMT

US National Debt : ఒకప్పుడు మేక్ అమెరికా గ్రేట్ ఎగైన్ అనే నినాదం అమెరికన్లలో ప్రపంచవ్యాప్తంగా కొత్త ఆర్థిక విప్లవాన్ని ఆశలు రేకెత్తించింది. కానీ ప్రస్తుతం పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన దేశంగా ఉన్న అమెరికా ఆర్థిక వ్యవస్థపై భారం పెరుగుతోంది. దేశం మొత్తం అప్పు భయంకరమైన స్థాయికి చేరుకోవడం, అమెరికా భవిష్యత్తుపైనే ప్రశ్నార్థకం వేస్తోంది.

ప్రస్తుతం అమెరికా మొత్తం అప్పు 105.2 ట్రిలియన్ డాలర్లకు చేరుకుంది. దీన్ని సులభంగా అర్థం చేసుకోవాలంటే, ఈ మొత్తం అప్పు.. ఆ దేశం యొక్క స్థూల జాతీయోత్పత్తి కంటే దాదాపు 3.5 రెట్లు ఎక్కువ. ఏ దేశ ఆర్థిక వ్యవస్థకైనా ఇది చాలా ప్రమాదకరమైన సంకేతం. ఈ అప్పుల భారం కేవలం ఫెడరల్ ప్రభుత్వంపైనే కాకుండా, సాధారణ పౌరుల రుణాలను కూడా కలుపుకుని ఈ స్థాయిలో ఉంది.

ఈ $105.2 ట్రిలియన్ల అప్పులో వివిధ విభాగాల వాటా ఇలా ఉంది:

ఫెడరల్ ప్రభుత్వ అప్పు : $38.2 ట్రిలియన్లు (ఇది ప్రతి సంవత్సరం కొత్త రికార్డులను సృష్టిస్తోంది).

సాధారణ పౌరుల ప్రైవేట్ రుణం: $26.4 ట్రిలియన్లు.

మార్టిగేజ్ రుణం (ఇంటి లోన్లు): $21.3 ట్రిలియన్లు.

విద్యార్థుల రుణం : $1.8 ట్రిలియన్లు.

2028 నాటికి $50 ట్రిలియన్లకు పెరిగే అవకాశం

అమెరికాలో ఫెడరల్ ప్రభుత్వ అప్పు విపరీతంగా పెరిగిపోతోంది. ఈ అప్పు పెరుగుదల గత కొన్ని దశాబ్దాలుగా తీవ్రంగా ఉంది. అక్టోబర్ 1995లో ఈ అప్పు $4.9 ట్రిలియన్లుగా ఉండేది. అక్టోబర్ 2015 నాటికి $18.1 ట్రిలియన్లకు చేరింది. ప్రస్తుతం (2025 నాటికి) ఇది $38.2 ట్రిలియన్లుగా ఉంది. ఆర్థిక నిపుణుల అంచనా ప్రకారం, 2028 నాటికి ఫెడరల్ ప్రభుత్వ అప్పు ఏకంగా $50 ట్రిలియన్లకు చేరుకోనుంది.

వడ్డీ చెల్లింపులే పెద్ద భారం

ఆర్థికవేత్తలను కలవరపరిచే అతి పెద్ద సమస్య ఏమిటంటే, ఈ భారీ అప్పుపై వడ్డీ చెల్లించడానికే ఏటా బిలియన్ల డాలర్లు ఖర్చు అవుతున్నాయి. అమెరికా రోజువారీగా బిలియన్ల డాలర్లు వడ్డీ రూపంలోనే చెల్లించాల్సి వస్తోంది. ఈ డబ్బును వడ్డీ చెల్లింపులకు కాకుండా, రోడ్ల నిర్మాణం, విద్య, ఆరోగ్య సంరక్షణ లేదా కొత్త సాంకేతికతలలో పెట్టుబడి పెట్టి ఉంటే, అమెరికా అభివృద్ధి మరింత వేగంగా ఉండేదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Tags:    

Similar News