Brand Value : ఈ 25 మందికి తిరుగే లేదు.. టాప్ 25 సెలబ్రిటీల సంపాదన.. రూ.1.77 లక్షల కోట్లు

టాప్ 25 సెలబ్రిటీల సంపాదన.. రూ.1.77 లక్షల కోట్లు

Update: 2025-09-26 05:26 GMT

Brand Value : టీవీలో లేదా ఆన్‌లైన్‌లో యాడ్ వచ్చినప్పుడు మనకు కనిపించే క్రికెటర్లు, సినీ నటులు కేవలం వినోదాన్ని మాత్రమే అందించడం లేదు. వీరు పెద్ద పెద్ద బ్రాండ్‌లకు కోట్ల రూపాయల వ్యాపారాన్ని తెచ్చిపెడుతున్నారు. 2024 సంవత్సరానికిగాను భారతదేశంలోని టాప్ 25 మంది సెలబ్రిటీల మొత్తం బ్రాండ్ వాల్యూ దాదాపు 2 బిలియన్ డాలర్లు, అంటే సుమారు రూ.1.77 లక్షల కోట్లకు చేరింది. ఇది సెలబ్రిటీలు బ్రాండ్ మార్కెటింగ్‌లో ఎంత ప్రభావవంతంగా మారారో స్పష్టంగా తెలియజేస్తోంది.

కోహ్లీ, రణవీర్, షారుఖ్: టాప్ 3లో ఎవరు?

ఈ జాబితాలో క్రికెటర్ విరాట్ కోహ్లీ మొదటి స్థానంలో నిలిచారు. ఆయన బ్రాండ్ వాల్యూ రూ.1900 కోట్లు ($231.1 మిలియన్లు). గత ఏడాదితో పోలిస్తే ఆయన వాల్యూ 2 శాతం పెరిగింది. రణవీర్ సింగ్ రెండో స్థానంలో ఉన్నారు, అయితే ఆయన బ్రాండ్ వాల్యూ రూ.1665 కోట్ల ($203.1 మిలియన్లు) నుంచి రూ.1398.74 కోట్లకు ($170.7 మిలియన్లు) తగ్గింది. మూడో స్థానంలో ఉన్న షారుఖ్ ఖాన్ బ్రాండ్ వాల్యూ 21 శాతం పెరిగి రూ.1194 కోట్లకు ($145.7 మిలియన్లు) చేరుకుంది. ప్రజలు ఇంకా ఆయన గ్లామర్‌ను బాగా ఇష్టపడుతున్నారని ఇది నిరూపిస్తోంది.

నటీమణుల జోరు, క్రికెటర్ల హవా

నటులతో పాటు నటీమణులు కూడా బ్రాండ్ మార్కెట్‌లో ప్రముఖ స్థానాలను దక్కించుకున్నారు. ఆలియా భట్ నాలుగో స్థానంలో ఉన్నారు. ఆమె బ్రాండ్ వాల్యూ $116.4 మిలియన్లు. మన సౌత్ హీరోయిన్లలో రష్మిక మందన 15వ స్థానంలో ($58.9 మిలియన్లు) ఉన్నారు. కృతి సనన్ 27వ స్థానం నుంచి 19వ స్థానానికి, తమన్నా భాటియా 28వ స్థానం నుంచి 21వ స్థానానికి ఎగబాకారు. అనన్య పాండే 46వ స్థానం నుంచి నేరుగా 25వ స్థానానికి దూకడం విశేషం.

క్రికెటర్లలో దిగ్గజం సచిన్ టెండూల్కర్ ఐదవ స్థానంలో నిలిచారు. ఆయన బ్రాండ్ వాల్యూ పెరిగి రూ.920.04 కోట్లకు చేరుకుంది. జస్‌ప్రీత్ బుమ్రా కూడా 22వ స్థానంలో ఉన్నారు. 2023లో టాప్ 25 సెలబ్రిటీల మొత్తం బ్రాండ్ వాల్యూ $1.9 బిలియన్లు ఉండగా, 2024లో అది 2 బిలియన్ డాలర్లకు పెరిగింది. అయితే, గతంలో 15.5 శాతం ఉన్న ఈ వృద్ధి రేటు, ఇప్పుడు సుమారు 5 శాతానికి తగ్గింది. దీనిని బట్టి మార్కెట్‌లో వృద్ధి కాస్త నెమ్మదించినా, పెద్ద పెద్ద సెలబ్రిటీలు మాత్రం బ్రాండ్ మార్కెట్‌లో తమ స్థానాన్ని ఇంకా పటిష్టంగా ఉంచుకున్నారని అర్థమవుతోంది.

Tags:    

Similar News