Education Loan : తీసుకున్న వాళ్లు ఎడ్యూకేషన్ లోన్ కట్టకపోతే ఎవరు బాధ్యత వహించాలి?
ఎడ్యూకేషన్ లోన్ కట్టకపోతే ఎవరు బాధ్యత వహించాలి?
Education Loan : నేటి ఆధునిక ప్రపంచంలో ఎడ్యుకేషన్ చాలా ఖరీదైంది. పిల్లలకు మెరుగైన విద్య అందించాలనే లక్ష్యంతో తల్లిదండ్రులు, విద్యార్థులు పెద్ద మొత్తంలో ఎడ్యుకేషన్ లోన్ తీసుకోవడం సర్వసాధారణమైంది. అయితే, చదువు పూర్తయిన తర్వాత విద్యార్థికి ఉద్యోగం రాకపోతే లేదా ఏదైనా కారణం వల్ల లోన్ మొత్తాన్ని తిరిగి చెల్లించలేకపోతే పరిస్థితి ఏంటి? ఈఎంఐ చెల్లించే బాధ్యత ఎవరిపై పడుతుంది? లోన్ చెల్లించడంలో ఆలస్యమైతే విద్యార్థి, ముఖ్యంగా గ్యారంటర్ ఎలాంటి సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది? ఈ ముఖ్యమైన విషయాల గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవడం చాలా అవసరం.
ఎడ్యుకేషన్ లోన్ తీసుకున్న విద్యార్థికి ఆ మొత్తాన్ని తిరిగి చెల్లించాల్సిన పూర్తి బాధ్యత ఉంటుంది. అయితే, కొన్ని అనుకోని పరిస్థితుల్లో లోన్ కట్టలేని పరిస్థితి ఏర్పడవచ్చు. అటువంటి సందర్భాలలో, విద్యార్థి మొదట బ్యాంకును సంప్రదించి, లోన్ చెల్లించడానికి మరికొంత సమయం అడగవచ్చు. అలాగే, లోన్ తిరిగి చెల్లించే నిబంధనలను మార్చమని కూడా బ్యాంకును కోరవచ్చు.
ఒకవేళ విద్యార్థి అదనపు సమయం తీసుకున్నా లేదా షరతులు మార్చుకున్నా కూడా లోన్ చెల్లించడంలో విఫలమైతే, అప్పుడు బ్యాంక్ ఆ విద్యార్థిని డిఫాల్టర్‌గా ప్రకటిస్తుంది. డిఫాల్టర్ అని ప్రకటించిన తర్వాత, లోన్ మొత్తాన్ని తిరిగి చెల్లించాల్సిన బాధ్యత గ్యారంటర్‌పై పడుతుంది. ఈ మొత్తాన్ని బ్యాంకు చట్టబద్ధంగా గ్యారంటర్ నుండి వసూలు చేయవచ్చు.
ఎడ్యూకేషనల్ లోన్ ఈఎంఐలను సకాలంలో చెల్లించకపోతే బ్యాంక్ వెంటనే చర్యలు తీసుకోవడం ప్రారంభిస్తుంది. లోన్ చెల్లింపు ఆలస్యమైనప్పుడు బ్యాంక్ మొదట నోటీసు పంపుతుంది. నోటీస్ పంపిన తర్వాత కూడా లోన్ కిస్తీలు కట్టకపోయినా, బ్యాంకును సంప్రదించకపోయినా, బ్యాంక్ అప్పుడు వసూలు ప్రక్రియను ప్రారంభిస్తుంది.
ఈ రికవరీ ప్రక్రియలో బ్యాంక్ అవసరమైన చట్టపరమైన చర్యలు తీసుకోవడంతో పాటు, తనఖా పెట్టిన ఆస్తులను జప్తు కూడా చేయవచ్చు. విద్యార్థి లోన్ చెల్లించని పక్షంలో, గ్యారంటర్ క్రెడిట్ స్కోరు కూడా దెబ్బతింటుంది. దీని కారణంగా భవిష్యత్తులో గ్యారంటర్‌గా ఉన్న వ్యక్తికి కొత్తగా ఏ లోన్ తీసుకోవాలన్నా తీవ్రమైన ఇబ్బందులు ఎదురవుతాయి. విద్యార్థితో పాటు గ్యారంటర్ కూడా ఈ ఆర్థిక, చట్టపరమైన చిక్కులను నివారించడానికి లోన్ నిబంధనల గురించి పూర్తి అవగాహన కలిగి ఉండటం చాలా ముఖ్యం.