Wireless Electricity : ఇక వైఫై లాగే విద్యుత్.. ఫిన్లాండ్ శాస్త్రవేత్తల అద్భుత ఆవిష్కరణ
ఫిన్లాండ్ శాస్త్రవేత్తల అద్భుత ఆవిష్కరణ
Wireless Electricity : ప్రపంచం ఇప్పుడు మరో అద్భుతానికి సాక్ష్యం కాబోతోంది. మనం వైఫై ద్వారా ఇంటర్నెట్‌ను ఎలాగైతే వాడుకుంటున్నామో, భవిష్యత్తులో విద్యుత్తును కూడా వైర్లు లేకుండానే పొందే రోజులు దగ్గరపడ్డాయి. ఫిన్లాండ్ శాస్త్రవేత్తలు చేపట్టిన తాజా ప్రయోగాలు విజయవంతం కావడంతో వైర్లెస్ ఎలక్ట్రిసిటీ కల నిజం కాబోతోంది. సాధారణంగా విద్యుత్ ఒక చోటు నుంచి మరో చోటికి వెళ్లాలంటే రాగి వైర్లు లేదా కేబుల్స్ అవసరం. కానీ ఫిన్లాండ్ శాస్త్రవేత్తలు ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్, రిసోనెంట్ కప్లింగ్ అనే టెక్నాలజీని ఉపయోగించి గాలి ద్వారా విద్యుత్తును పంపవచ్చని నిరూపించారు. అంటే, ఒక ట్రాన్స్‌మిటర్ నుంచి వెలువడే రేడియో ఫ్రీక్వెన్సీ తరంగాలను ఉపయోగించి, ఎలాంటి ఫిజికల్ కనెక్షన్ లేకుండానే రిసీవర్ విద్యుత్తును అందుకుంటుంది. మనం వైఫై ద్వారా డేటాను ఎలా పొందుతున్నామో, అదే పద్ధతిలో విద్యుత్ ప్రసారం జరుగుతుంది. ప్రస్తుతం ఈ ప్రయోగాలు తక్కువ దూరంలో విజయవంతం అయ్యాయి.
కేవలం ఫిన్లాండ్ మాత్రమే కాదు, అమెరికా రక్షణ పరిశోధనా సంస్థ దార్పా(DARPA) కూడా ఈ రంగంలో సంచలనం సృష్టించింది. వారు లేజర్ కిరణాల ద్వారా సుమారు 8 నుంచి 9 కిలోమీటర్ల దూరం వరకు వైర్లెస్ పద్ధతిలో విద్యుత్తును పంపగలిగారు. వారి తాజా ప్రయోగంలో 8.6 కిలోమీటర్ల దూరం వరకు 800 వాట్ల విద్యుత్తును విజయవంతంగా ప్రసారం చేశారు. గతంలో ఇదే సంస్థ కేవలం 1.7 కిలోమీటర్ల దూరం మాత్రమే విద్యుత్తును పంపగలిగింది. ఈ టెక్నాలజీ అభివృద్ధి చెందితే యుద్ధ క్షేత్రాల్లో ఉన్న సైనికులకు లేదా విపత్తు సమయాల్లో మారుమూల ప్రాంతాలకు విద్యుత్తును పంపడం చాలా సులభం అవుతుంది.
వైర్లెస్ విద్యుత్ అనే ఆలోచన ఈనాటిది కాదు. ప్రఖ్యాత శాస్త్రవేత్త నికోలా టెస్లా ఒక శతాబ్దం క్రితమే దీని గురించి కలలు కన్నారు. ఇప్పుడు ఆ కల నిజమవుతోంది. భవిష్యత్తులో అంతరిక్షంలో ఉండే సోలార్ ప్యానెల్స్ ద్వారా సూర్యరశ్మిని సేకరించి, ఆ శక్తిని విద్యుత్తుగా మార్చి వైర్లెస్ పద్ధతిలో భూమికి పంపే ప్రయోగాలు కూడా జరుగుతున్నాయి. దీనివల్ల వాతావరణ కాలుష్యం లేకుండా, ఎల్లప్పుడూ చౌకగా విద్యుత్ పొందే అవకాశం ఉంటుంది. డేటా సెంటర్ల నుంచి వెలువడే వేడిని ఉపయోగించి కూడా విద్యుత్ తయారు చేసే దిశగా శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తున్నారు.
ఈ వైర్లెస్ టెక్నాలజీ అందుబాటులోకి వస్తే రోడ్ల మీద ఉండే విద్యుత్ వైర్ల గందరగోళం తప్పుతుంది. తుపాన్లు లేదా భారీ వర్షాల వల్ల వైర్లు తెగిపోయి కరెంట్ పోయే సమస్య ఉండదు. ప్రతి ఇంట్లో స్విచ్ బోర్డులు లేదా వైర్ల అవసరం లేకుండానే టీవీలు, ఫ్రిజ్ లు, ఫోన్ చార్జర్లు పనిచేస్తాయి. ముఖ్యంగా ఎలక్ట్రిక్ వాహనాలు రోడ్డుపై వెళ్తుండగానే ఆటోమేటిక్ గా చార్జ్ అయ్యే సౌకర్యం కలుగుతుంది. ఇదొక గొప్ప పర్యావరణ హితమైన మార్పు అని శాస్త్రవేత్తలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.