Rajamouli’s Key Instructions to Fans: గ్రాండ్ గ్లోబ్ ట్రాటర్ ఓపెన్ ఈవెంట్ కాదు.. ఫ్యాన్స్‌కు రాజమౌళి కీలక సూచనలు
ఫ్యాన్స్‌కు రాజమౌళి కీలక సూచనలు
Rajamouli’s Key Instructions to Fans: ప్రముఖ దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి, హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో 15న జరగనున్న ప్రతిష్టాత్మక గ్రాండ్ గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్‌పై కీలక ప్రకటన చేశారు. ఈ ఈవెంట్ ఓపెన్ ఈవెంట్ కాదని.. కేవలం ఫిజికల్ పాసులు ఉన్న వారికి మాత్రమే ప్రవేశం ఉంటుందని ఆయన సోషల్ మీడియా ద్వారా స్పష్టం చేశారు.
దాదాపు 50,000 మందికి పైగా అభిమానులు హాజరుకానున్న ఈ అతిపెద్ద లైవ్ ఫ్యాన్ ఈవెంట్ భద్రతా ఏర్పాట్లు, నిబంధనలపై ఆయన అభిమానులకు విజ్ఞప్తి చేశారు.
భద్రత కట్టుదిట్టం: పోలీసుల కఠిన సూచనలు
ఇటీవల జరిగిన కొన్ని సంఘటనల నేపథ్యంలో పోలీసులు ఈసారి భద్రత విషయంలో చాలా కఠినంగా వ్యవహరిస్తున్నారని రాజమౌళి తెలిపారు. "ఇది ఓపెన్ ఈవెంట్ కాదు. కేవలం ఫిజికల్ పాసులు ఉన్నవారు మాత్రమే లోపలికి రావాలి" అని రాజమౌళి స్పష్టం చేశారు. ఆన్‌లైన్‌లో పాసులు విక్రయిస్తున్నారని వస్తున్న తప్పుడు ప్రచారాన్ని నమ్మవద్దని ఆయన హెచ్చరించారు. ఈవెంట్‌కు హాజరయ్యే ప్రతి ఒక్కరి భద్రతను దృష్టిలో ఉంచుకుని పోలీసులు కఠినమైన సూచనలు జారీ చేశారని, దయచేసి అందరూ సహకరించాలని కోరారు. భద్రతా కారణాల దృష్ట్యా, 18 ఏళ్లలోపు పిల్లలకు, వృద్ధులకు ఈవెంట్‌కు అనుమతి లేదని పోలీసులు స్పష్టం చేసినట్లు ఆయన పేర్కొన్నారు.
వేదిక వద్దకు చేరుకునే మార్గాలు
అభిమానులకు సౌకర్యంగా ఉండేందుకు వేదిక వద్దకు చేరుకునే మార్గాలను కూడా రాజమౌళి వివరించారు.‘‘ మీ పాసులపై క్యూఆర్ కోడ్‌లు ఉంటాయి. వాటిని స్కాన్ చేస్తే, వేర్వేరు ప్రాంతాల నుంచి వేదిక వద్దకు ఎలా చేరుకోవాలో స్పష్టమైన వీడియోల రూపంలో సూచనలు లభిస్తాయి’’ అని రాజమౌళి తెలిపారు. దారిపొడవునా సైన్ బోర్డులు కూడా ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. భారత సినీ చరిత్రలోనే అతిపెద్ద లైవ్ ఈవెంట్‌లలో ఒకటిగా నిలవనున్న ఈ కార్యక్రమం కోసం ప్రపంచంలోనే అతిపెద్ద స్టేజ్, స్క్రీన్ ఏర్పాటు చేస్తుండటం విశేషం.