‘Ranabaali’: విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక పీరియాడిక్ యాక్షన్ డ్రామా రణబాలి విడుదల తేదీలో మార్పు చోటుచేసుకుంది. తొలుత సెప్టెంబర్ 11న తీసుకురావాలని భావించినప్పటికీ, తాజా నిర్ణయం ప్రకారం ఈ చిత్రాన్ని అక్టోబర్ 16న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా థియేటర్లలోకి తీసుకురానున్నట్లు నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ అధికారికంగా ప్రకటించింది. “మన చరిత్రలోని చీకటి అధ్యాయం ఈ అక్టోబర్‌లో తెరుచుకోనుంది” అంటూ సరికొత్త పోస్టర్‌ను విడుదల చేసింది.

చిత్ర విశేషాలు - పాత్రలు

హిట్ కాంబినేషన్ హ్యాట్రిక్:

గీత గోవిందం, డియర్ కామ్రేడ్ వంటి విజయవంతమైన చిత్రాల తర్వాత విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న కలిసి నటిస్తున్న మూడో చిత్రమిది. విజయ్ దేవరకొండ టైటిల్ రోల్ రణబాలిగా కనిపించనుండగా, రష్మిక ఆయన భార్య జయమ్మ పాత్రలో మెప్పించనుంది. హాలీవుడ్ చిత్రం ది మమ్మీ ఫేమ్ ఆర్నాల్డ్ వోస్లూ ఇందులో సర్ థియోడోర్ హెక్టర్ అనే క్రూరమైన బ్రిటిష్ ప్రతినాయకుడి పాత్రను పోషిస్తున్నారు.

19వ శతాబ్దపు బ్రిటిష్ పాలన కాలం (1854 - 1878) నాటి వాస్తవ చారిత్రక పరిస్థితుల స్ఫూర్తితో ఈ సినిమాను రూపొందిస్తున్నారు. చరిత్ర పుస్తకాల్లో ఎక్కువగా వెలుగుచూడని మరుగునపడిన రికార్డులు, మౌఖిక కథనాల ఆధారంగా అత్యున్నత సినిమాటిక్ విలువలతో ఈ పీరియడ్ యాక్షన్ డ్రామాను తీర్చిదిద్దుతున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తుండగా, టీ-సిరీస్ సమర్పిస్తోంది.

Tags: