TTD: 7.83 లక్షల మందికి దర్శనం.. 41 కోట్ల హుండీ ఆదాయం!
41 కోట్ల హుండీ ఆదాయం!
TTD: తిరుమల క్షేత్రంలో పది రోజుల పాటు జరిగిన వైకుంఠ ద్వార దర్శనాలు భక్తుల పాలిట ఒక చిరస్మరణీయ అనుభూతిని మిగిల్చాయి. టీటీడీ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా ఈసారి రికార్డు స్థాయిలో 7.83 లక్షల మంది భక్తులు ఉత్తర ద్వారం ద్వారా శ్రీవారిని దర్శించుకున్నారు. గత ఏడాదితో పోలిస్తే ఈసారి సుమారు లక్ష మంది భక్తులకు అదనంగా దర్శన భాగ్యం కల్పించడం విశేషం. ఏఐ (AI) సాంకేతికతతో కూడిన నిఘా, పకడ్బందీ క్యూలైన్ల నిర్వహణ వల్ల సామాన్య భక్తులకు అత్యధిక ప్రాధాన్యత లభించింది.
ఈ పది రోజుల కాలంలో శ్రీవారికి భక్తులు భారీగా కానుకలు సమర్పించారు. హుండీ ద్వారా ఏకంగా రూ. 41.14 కోట్ల ఆదాయం సమకూరినట్లు టీటీడీ ప్రకటించింది. ప్రసాదాల విషయంలోనూ రికార్డులు నమోదయ్యాయి; మొత్తం 44 లక్షల లడ్డూలను భక్తులు కొనుగోలు చేశారు. భక్తుల ఆకలి తీర్చడంలో అన్నప్రసాద విభాగం కీలక పాత్ర పోషించింది. సుమారు 33 లక్షల మంది భక్తులకు రుచికరమైన అన్నప్రసాదాలను, వేడి బాదం పాలను నిరంతరాయంగా పంపిణీ చేశారు.
మొత్తం అందుబాటులో ఉన్న 182 గంటల దర్శన సమయంలో, వీవీఐపీ సిఫార్సు లేఖలను పక్కన పెట్టి ఏకంగా 164 గంటల సమయాన్ని కేవలం సామాన్య భక్తులకే కేటాయించారు. దీనివల్ల సర్వదర్శనం టోకెన్లు లేని వారు కూడా వేగంగా స్వామివారిని దర్శించుకోగలిగారు. టీటీడీ చేసిన ఏర్పాట్లపై నిర్వహించిన సర్వేలో 93 శాతం మంది భక్తులు పూర్తి సంతృప్తి వ్యక్తం చేయడం గమనార్హం.
ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆలయాన్ని 50 టన్నుల సాంప్రదాయ పుష్పాలు, 10 టన్నుల పండ్లు, 4 టన్నుల విదేశీ కట్ ఫ్లవర్స్‌తో నయన మనోహరంగా అలంకరించారు. ఈ పది రోజుల్లో 2.06 లక్షల మంది భక్తులు తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. పోలీసు , విజిలెన్స్ విభాగాలు సమన్వయంతో పనిచేయడం వల్ల ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉత్సవాలు ముగిశాయి.