The Shivling That Changes Colors Five Times a Day: అద్భుతం.. రోజుకు 5 సార్లు రంగులు మార్చే శివలింగం.. ఈ ఆలయం ఎక్కడుందో తెలుసా?
ఈ ఆలయం ఎక్కడుందో తెలుసా?
The Shivling That Changes Colors Five Times a Day: భారతదేశంలో ఎన్నో పురాతన, రహస్యమైన దేవాలయాలు ఉన్నాయి. అందులోనూ తమిళనాడును దేవాలయాల భూమి అని పిలుస్తారు. తంజావూరు జిల్లాలోని నల్లూరు గ్రామంలో ఉన్న కళ్యాణ సుందరేశ్వర ఆలయం అటువంటి ఒక మహాద్భుతానికి నిలయం. ఇక్కడ వెలసిన శివలింగం రోజుకు ఐదు సార్లు రంగులు మారుతూ భక్తులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
రంగుల వెనుక ఉన్న దైవిక రహస్యం
ఈ వెయ్యేళ్ల నాటి పురాతన ఆలయంలోని శివలింగం సూర్యుని గమనాన్ని బట్టి రోజులో ఐదు వేర్వేరు రంగులలో కనిపిస్తుందని భక్తుల నమ్మకం:
ఉదయం: నలుపు రంగు
మధ్యాహ్నం: తెలుపు రంగు
సాయంత్రం: ఎరుపు రంగు
రాత్రి: లేత నీలం రంగు
అర్ధరాత్రి: ఆకుపచ్చ రంగు
ఈ అద్భుతాన్ని కళ్లారా చూడటానికి దేశం నలుమూలల నుండి భక్తులు నల్లూరుకు తరలివస్తుంటారు. ఈ రంగు మార్పులకు సంబంధించి ఇప్పటికీ ఎలాంటి శాస్త్రీయ వివరణ లేకపోవడం గమనార్హం.
చోళుల కాలం నాటి వైభవం
చారిత్రక ఆధారాల ప్రకారం, ఈ ఆలయాన్ని వెయ్యి ఏళ్ల క్రితం ప్రముఖ చోళ చక్రవర్తి రాజరాజ చోళుడు నిర్మించారు. ద్రావిడ వాస్తుశిల్పానికి ప్రతీకగా నిలిచే ఈ ఆలయంలో శివుడిని కళ్యాణ సుందరేశ్వరుడుగా పూజిస్తారు. ఇక్కడ శివలింగంతో పాటు మురుగన్ స్వామికి కూడా ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది.
రెండు శివలింగాల ప్రత్యేకత
ఈ ఆలయంలో మరో విశేషం ఏమిటంటే.. ఇక్కడ రెండు నల్లరాతి శివలింగాలు ఉన్నాయి. గర్భగుడిలోని ప్రధాన లింగాన్ని బంగారు ఆభరణాలతో అలంకరిస్తారు. ప్రవేశ ద్వారం వద్ద ఉన్న మరో లింగానికి ప్రతిరోజూ ఉదయం గంధపు చెక్కతో అభిషేకం చేస్తారు. ఆ సమయంలో వెలువడే సువాసన భక్తులకు ఒక దివ్యమైన అనుభూతిని కలిగిస్తుంది.
పూజలు - పండుగలు
ఇక్కడ ప్రతిరోజూ ఐదు కాలాల పూజలు నిర్వహిస్తారు. ఒక్కో పూజ సమయంలో స్వామివారు ఒక్కో రూపంలో భక్తులకు దర్శనమిస్తారని ప్రతీతి. మహాశివరాత్రి, ప్రదోషం వంటి పర్వదినాల్లో ఈ ఆలయం భక్తుల కోలాహలంతో నిండిపోతుంది. ప్రాచీన చరిత్ర, అద్భుత వాస్తుకళ మరియు దైవిక మహిమలు కలిసిన ఈ క్షేత్రం ప్రతి ఒక్కరూ దర్శించాల్సిన పవిత్ర స్థలం.