Alert for Devotees: భక్తులకు అలర్ట్: తిరుచానూరు ఆలయంలో ఆర్జిత సేవలు రద్దు.. కారణం ఇదే!

కారణం ఇదే!

Update: 2026-04-11 08:05 GMT

Alert for Devotees: తిరుచానూరులో వేంచేసి ఉన్న శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో వార్షిక వసంతోత్సవాలు అత్యంత వైభవంగా జరగనున్నాయి. ఏప్రిల్ 30వ తేదీ నుంచి మే 2వ తేదీ వరకు మూడు రోజుల పాటు ఈ వేడుకలను నిర్వహించనున్నట్లు టీటీడీ వెల్లడించింది. ప్రకృతి పులకించే వసంత కాలంలో అమ్మవారికి జరిగే ఈ ఉత్సవాలను చూసేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తారు. ఈ వేడుకలకు శ్రీకారం చుడుతూ ఏప్రిల్ 29న సాయంత్రం అంకురార్పణ కార్యక్రమం జరుగుతుంది.

ముఖ్యంగా మే 1వ తేదీన అమ్మవారి 'స్వర్ణ రథోత్సవం' జరగనుంది. బంగారు రథంపై అమ్మవారు విహరిస్తుంటే చూడటం భక్తులకు కన్నుల పండువగా ఉంటుంది. ఈ మూడు రోజుల పాటు మధ్యాహ్నం వేళలో శుక్రవారపు తోటలో అమ్మవారికి ప్రత్యేకంగా అభిషేకాలు (స్నపన తిరుమంజనం) చేస్తారు. రాత్రి సమయాల్లో అమ్మవారు మాడ వీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిస్తారు. ఎవరైనా భక్తులు ఈ సేవలో పాల్గొనాలనుకుంటే రూ. 150 చెల్లించి టికెట్ కొనుగోలు చేయవచ్చు.

అంతకంటే ముందుగా, ఏప్రిల్ 28న ఆలయాన్ని శుద్ధి చేసే 'కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం' కార్యక్రమం ఉంటుంది. ఆ రోజు ఉదయం 6 నుండి 9 గంటల వరకు ఆలయ గోడలు, పైకప్పు, పూజా సామాగ్రిని పవిత్ర జలంతో కడుగుతారు. పసుపు, కుంకుమ, చందనం వంటి సుగంధ ద్రవ్యాలతో ఆలయమంతా ప్రోక్షణం చేస్తారు. ఈ శుద్ధి కార్యక్రమం వల్ల ఆ రోజు ఉదయం 9 గంటల తర్వాతే భక్తులకు దర్శనం కల్పిస్తారు. ఉత్సవాల కారణంగా ఏప్రిల్ 28, ఏప్రిల్ 30 నుండి మే 2 వరకు కల్యాణోత్సవం, సహస్ర దీపాలంకార సేవలను టీటీడీ రద్దు చేసింది.

Tags:    

Similar News