Annual Brahmotsavams: మార్చి 27 నుండి ఒంటిమిట్టలో వార్షిక బ్రహ్మోత్సవాలు
ఒంటిమిట్టలో వార్షిక బ్రహ్మోత్సవాలు
Annual Brahmotsavams: ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో మార్చి 27 నుండి ఏప్రిల్ 5వ తేదీ వరకు జరుగనున్న వార్షిక బ్రహ్మోత్సవాలు మరియు బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఏప్రిల్ 1న జరుగనున్న శ్రీ సీతారాముల కల్యాణం ఏర్పాట్లను వేగవంతం చేయాలని టిటిడి జెఈవో శ్రీ వి. వీరబ్రహ్మం అధికారులను ఆదేశించారు. ఇప్పటివరకు చేపట్టిన బ్రహ్మోత్సవాల ఏర్పాట్ల పనులు, ప్రస్తుతం జరుగుతున్న అభివృద్ధి పనులు, భవిష్యత్తులో చేపట్టాల్సిన పనులను పరిశీలించి, అన్ని విభాగాల అధికారులతో సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా జెఈవో అధికారులతో కలిసి శ్రీ కోదండ రామస్వామి వారి ఆలయం ముందు తాత్కాలికంగా ఏర్పాటు చేసిన వంటశాల, ముడి సరుకులు నిల్వ ఉంచే షెడ్లను పరిశీలించి, సకాలంలో పూర్తి చేయాలని ఆదేశించారు. అదేవిధంగా భక్తులకు అన్నప్రదాలు పంపిణీ చేసేందుకు వీలుగా టేబులు, కుర్చీలు ఏర్పాటు చేయాలని సూచించారు. ఆలయంలోను, యాగశాలలో మరమత్తు పనులు త్వరిత గతిన పూర్తి చేయాలన్నారు. టిటిడి స్థానిక ఆలయాల్లో ఏ విధంగా అయితే శ్రీవారి సేవకుల సేవలు వినియోగించుకుంటున్నారో అదేవిధంగా ఒంటిమిట్ట కోదండరామస్వామివారి ఆలయంలో వినియోగించుకోవాలని సూచించారు. ఆలయ ప్రాంగణం సమీపంలో ఫోటో ఎగ్జిబిషన్, సాంస్కృతిక కార్యక్రమాల వేదికను పరిశీలించారు.
అనంతరం కళ్యాణ వేదిక వద్ద జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు. భక్తులకు తలంబ్రాలు, అన్నప్రసాదాలు అందించే 17 కౌంటర్లు, ప్రవేశ, నిష్క్రమణ గేట్లను పరిశీలించారు. కల్యాణ వేదిక ప్రాంగణంలోని వసతి సముదాయం వద్ద ఉన్న జల ప్రసాదమును వినియోగంలోకి తీసుకురావాలన్నారు. కల్యాణ వేదికకు నలువైపులా పచ్చదనానికి ప్రాముఖ్యత ఇచ్చేలా తీర్చిదిద్దాలని అటవీ శాఖ అధికారులను ఆదేశించారు.
ఆలయం నుండి కల్యాణ వేదిక వరకు రోడ్డు ఇరువైపుల మొక్కలు పెంచాలని సూచించారు. కళ్యాణ వేదిక వద్ద విఐపిలు బస చేసేందుకు అవసరమైన ఏర్పాట్లను ప్రణాళిక బద్ధంగా పూర్తి చేయాలన్నారు. కల్యాణ వేదిక ప్రాంగణంలో ఏర్పాటు చేసే తాత్కాలిక వంటశాల స్థలాన్ని పరిశీలించి పలు సూచనలు చేశారు.
అటు తర్వాత జేఈవో అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో మాట్లాడుతూ, భక్తులకు సౌకర్యవంతంగా క్యూలైన్లు, వసతి షెల్టర్లు, సూచిక బోర్డులు, తాగునీటి సౌకర్యం, తదితర ఇంజనీరింగ్ పనులు సకాలంలో పూర్తి చేయాలన్నారు. రథం తిరిగే వీధులను, ముఖ్యంగా మాడ వీధుల్లో మరమ్మతు పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. భక్తులను ఆకట్టుకునేలా కటౌట్లు, విద్యుత్ దీపాలంకరణలు, పుష్పాలంకరణలు ఏర్పాటు చేయాలన్నారు.
బ్రహ్మోత్సవాల విజయవంతానికి అన్ని విభాగాల సిబ్బందిని డిప్యూటేషన్ పై నియమించాలన్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యాం కలుగకుండా ప్రధమ చికిత్స కేంద్రాలు, నిపుణులైన వైద్య సిబ్బంది, మందులు, అంబులెన్స్‌లు ఏర్పాటు చేయాలన్నారు. పబ్లిక్ అడ్రస్ సిస్టం ద్వారా నిరంతరాయంగా శ్రీరామనామం ప్రసారం చేయాలన్నారు. బ్రహ్మోత్సవాలకు ముందు 10 రోజులపాటు ప్రచార రథాల ద్వారా పరిసర గ్రామాల్లో విస్తృతంగా ప్రచారం చేయాలని, బ్రహ్మోత్సవాల కరపత్రాలు పంపిణీ చేయాలన్నారు.
స్వామివారి కల్యాణానికి పెద్ద సంఖ్యలో తరలివచ్చే భక్తులకు అన్నప్రసాదాల పంపిణీలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేయాలన్నారు. భక్తులకు ఎండ వేడిమి నుంచి ఉపశమనం కలిగించడానికి విరివిగా మజ్జిగ, తాగునీరు పంపిణీ చేయడానికి అవసరమైన కౌంటర్లు సిద్ధం చేసుకోవాలన్నారు. టీటీడీ విజిలెన్స్ అధికారులు స్థానిక పోలీసులతో సమన్వయం చేసుకుని భద్రత, పార్కింగ్ ఏర్పాట్లకు ప్రణాళిక సిద్ధం చేయాలని సూచించారు. బ్రహ్మోత్సవాల వాహన సేవలను భక్తులు వీక్షించేందుకు వీలుగా ఎల్.ఈ.డి స్క్రీన్ లు ఏర్పాటు చేయాలని, హిందూధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో భక్తులను ఆకట్టుకునేలా సాంస్కృతిక కార్యక్రమాలు, కవి సమ్మేళనము ఏర్పాటు చేయాలన్నారు. బ్రహ్మోత్సవాల వాహన సేవల ముందు హిందూ ధర్మ ప్రచార పరిషత్ భజన బృందాలచే ఆకట్టుకునేలా ప్రదర్శనలు ఉండాలని, అలాగే కల్యాణోత్సవం రోజున చక్కటి కార్యక్రమాలు ఏర్పాటు చేయాలన్నారు.