Brahmotsavams of Srivari Salakatla: ముత్యపు పందిరి వాహనంపై కాళీయ మర్ధనుడి అలంకారంలో శ్రీమలయప్ప
కాళీయ మర్ధనుడి అలంకారంలో శ్రీమలయప్ప
Brahmotsavams of Srivari Salakatla: శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో మూడో రోజు శుక్రవారం రాత్రి శ్రీ మలయప్పస్వామివారు శ్రీదేవి, భూదేవితో కలిసి కాళీయ మర్ధనుడి అలంకారంలో దర్శనమిచ్చారు. మాడ వీధుల్లో అంగరంగ వైభవంగా జరిగిన వాహనసేవలో వివిధ కళాబృందాల ప్రదర్శనలు భక్తులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. పెద్ద సంఖ్యలో భక్తులు స్వామివారిని వాహనసేవలో దర్శించుకున్నారు.
ముత్యపుపందిరి వాహనం
శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో మూడో రోజు రాత్రి శ్రీ మలయప్పస్వామివారు ముత్యపుపందిరి వాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిస్తారు. జ్యోతిషశాస్త్రం చంద్రునికి ప్రతీకగా ముత్యాలను తెలియజేస్తుంది. శ్రీకృష్ణుడు ముక్కుపై, మెడలో ముత్యాల ఆభరణాలు ధరించినట్టు పురాణాల్లో ఉంది. ఆదిశేషుని పడగలను ముత్యాల గొడుగా పూనిన స్వామివారిని దర్శించినా, స్తోత్రం చేసినా సకల శుభాలు కలుగుతాయని పురాణ ప్రశస్తి. చల్లని ముత్యాలకింద నిలిచిన శ్రీనివాసుని దర్శనం తాపత్రయాలను పోగొట్టి, భక్తుల జీవితాలకు చల్లదనాన్ని సమకూర్చుతుంది.