CM Chandrababu: తిరుమల పవిత్రత, పరిరక్షణకు అత్యంత ప్రాధాన్యం : సీఎం చంద్రబాబు
పరిరక్షణకు అత్యంత ప్రాధాన్యం : సీఎం చంద్రబాబు
CM Chandrababu: తిరుమల పవిత్రత, పరిరక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న అనంతరం, బుధవారం సాయంత్రం రంగనాయకుల మండపం నుండి భక్తులను ఉద్దేశించి ముఖ్యమంత్రి ప్రసంగించారు.
“ముఖ్యమంత్రిగా పట్టు వస్త్రాలు సమర్పించే అరుదైన అవకాశం స్వామివారు పలుమార్లు ప్రసాదించారన్నారు. అలిపిరి ఘటనలో నా ప్రాణాలను రక్షించడం కూడా ఆయన సంకల్పమేనని నేను గాఢంగా విశ్వసిస్తున్నానని అన్నారు.
అన్నప్రసాదంపై మాట్లాడుతూ, దాదాపు నాలుగు దశాబ్దాల క్రితం దివంగత ఎన్.టి.రామారావు ప్రారంభించిన ఈ సత్కార్యం నేడు అనేక రెట్లు విస్తరించి, ప్రతిరోజూ లక్షలాది మంది భక్తులకు అన్నప్రసాదం అందజేస్తోందని పేర్కొన్నారు. ఈ సేవను అన్ని టిటిడి ఆలయాలకు విస్తరించాలని టిటిడి చైర్మన్, బోర్డు సభ్యులు, అధికారులను ఆయన కోరారు.
శ్రీవాణి ట్రస్ట్ ఇప్పటివరకు రూ.2,038 కోట్లు విరాళాలు అందిందని, అందులో రూ.837 కోట్లు ఆలయ నిర్మాణానికి ఖర్చు చేశారు. రూ.200 కోట్లకుపైగా వడ్డీ రూపంలో కూడా వచ్చాయన్నారు. ఐదు వేల ఆలయాల నిర్మాణానికి శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. 29 రాష్ట్రాల రాజధానులలో శ్రీవారి ఆలయాలను నిర్మించేందుకు చర్యలు చేపట్టాలని, వివిధ దేశాల్లో శ్రీవారి భక్తులు అధికంగా ఉండే ప్రాంతాల్లో శ్రీవారి ఆలయాలను నిర్మించాలని సూచించారు. శ్రీవారిని ప్రపంచ వ్యాప్తంగా ఆరాధించే అవకాశం కల్పించేలా చర్యలు తీసుకోవాలని, దీనికి దాతలు విస్తృతంగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు.
తనకు ప్రాణభిక్ష పెట్టిన రోజునే ఎస్‌వి ప్రాణదాన ట్రస్ట్ను టిటిడిలో ప్రారంభించామని గుర్తుచేశారు. ఇప్పటివరకు రూ.709 కోట్లు ఈ ట్రస్టుకు విరాళంగా వచ్చాయన్నారు. ఈ ట్రస్ట్ ద్వారా పేదలకు, అవసరమైన రోగులకు వైద్య సహాయంగా ఖర్చు చేస్తున్నట్లు తెలిపారు. రాయలసీమ ప్రాంతంలో వైద్య సౌకర్యాలను అభివృద్ధి చేయాలని టిటిడిని కోరారు.