Brahmotsavam Celebrations: బ్రహ్మోత్సవాలకు విస్తృత ఏర్పాట్లు

విస్తృత ఏర్పాట్లు

Update: 2026-02-05 07:04 GMT

Brahmotsavam Celebrations: శ్రీనివాసమంగాపురం శ్రీ కళ్యాణ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలకు విస్తృత ఏర్పాట్లు చేపట్టాలని టీటీడీ జేఈవో వి. వీరబ్రహ్మం అధికారులను ఆదేశించారు. ఫిబ్రవరి 8 – 16వ తేదీ వరకు జరుగనున్న బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై జేఈవో బుధ‌వారం అధికారులతో ఆలయంలో సమీక్ష నిర్వహించారు.

ఈ సంద‌ర్భంగా జేఈవో మాట్లాడుతూ, ఫిబ్రవరి 8వ తేదీన ధ్వజారోహణంతో ప్రారంభమై, ఫిబ్రవరి 16వ తేదీన ధ్వజావరోహణంతో ముగియనున్న బ్రహ్మోత్సవాలకు రాజీలేని విధంగా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. శ్రీనివాసమంగాపురం ప‌రిస‌ర ప్రాంతాల గ్రామాల్లో ప్రచార రథాల ద్వారా విస్తృతంగా ప్రచారం చేపట్టాలన్నారు.

తిరుమల తరహాలో భక్తులను ఆకట్టుకునేలా ఏర్పాట్లు చేపట్టాలని అధికారులకు సూచించారు. శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వేంకటేశ్వర స్వామి ఆలయ విశిష్టత, బ్రహ్మోత్సవాలు, వాహన సేవల ప్రాముఖ్యత తదితర అంశాలపై ఎస్వీబీసీ , సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేపట్టాలన్నారు. అదేవిధంగా, తిరుపతి ప్రధాన ప్రాంతాల్లో, శ్రీనివాసమంగాపురం నలుమూలల విద్యుత్ అలంకరణలు చేపట్టాలని సూచించారు.

శ్రీవారి బ్రహ్మోత్సవాలలో భాగంగా ఫిబ్రవరి 12వ తేదీన గరుడసేవ రోజున అలంకరించేందుకు లక్ష్మీహారం శోభాయాత్ర, గోదాదేవి మాలలను ఊరేగింపుగా తీసుకొచ్చే మార్గాలను ముందస్తుగా పరిశీలించాలన్నారు. హిందూ ధర్మప్రచార పరిషత్‌, అన్నమాచార్య ప్రాజెక్టు, దాససాహిత్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో ప్రతి రోజూ ఆధ్యాత్మిక, ధార్మిక కార్యక్రమాలు, వాహన సేవల ముందు భజనలు, కోలాటాలు భ‌క్తుల‌ను ఆక‌ట్టుకునేలా ఏర్పాటు చేయాలన్నారు.

వాహన సేవల ఫిట్ నెస్ ను, పార్కింగ్, పుష్పాలంకరణలు, క్యూలైన్లు, చలువ పందిళ్లు, మొబైల్‌ మరుగుదొడ్లు, పారిశుద్ధ్యం, పారామెడికల్ సిబ్బంది, అన్నప్రసాదాలు, శ్రీవారి సేవకులు, తదితర ఏర్పాట్లపై సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో ఏర్పాట్లు చేపట్టాలని అధికారులకు సూచించారు.

టీటీడీ విజిలెన్స్‌, చంద్ర‌గిరి పోలీసులు సమన్వయం చేసుకుని పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు, ట్రాఫిక్ క్ర‌మ‌బ‌ద్ధీక‌ర‌ణ‌ చేపట్టాలని శాఖల వారీగా అధికారులకు సూచించారు. బ్ర‌హ్మోత్స‌వాల‌ను విజ‌య‌వంతం చేసేందుకు ఇత‌ర విభాగాల అధికారుల‌తో స‌మ‌న్వ‌యం చేసుకోవాల‌ని ఆల‌య ప్ర‌త్యేక‌శ్రేణి డెప్యూటీ ఈవో శ్రీ‌మ‌తి వ‌ర‌ల‌క్ష్మీ, ఆల‌య ప్ర‌త్యేకాధికారి మ‌రియు సీపీఆర్వో డా.ర‌వికి సూచించారు.

అనంతరం జేఈవో ఆలయ నాలుగు మాడ వీధుల్లో, వాహన మండపంలో జరుగుతున్న ఏర్పాట్లను ఇంజినీరింగ్‌ అధికారులతో కలిసి పరిశీలించి, ప‌లు సూచ‌న‌లు చేశారు.

Tags:    

Similar News