TTD Announces: నవంబర్ నెల దర్శన కోటా విడుదల వివరాలు
కోటా విడుదల వివరాలు
TTD Announces: తిరుమల శ్రీవారి నవంబర్ నెలకు సంబంధించిన వివిధ దర్శనాలు, ఆర్జిత సేవలు మరియు గదుల ఆన్‌లైన్ కోటా విడుదల తేదీలను తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) వెల్లడించింది. భక్తులు అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఈ టికెట్లను బుక్ చేసుకోవాలని అధికారులు సూచించారు.
నవంబర్ నెలకు సంబంధించిన సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాదపద్మారాధన సేవ వంటి ఆర్జిత సేవా టికెట్ల కోటాను ఆగస్టు 18వ తేదీ ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది. ఈ సేవా టికెట్ల ఎలక్ట్రానిక్ డిప్ కోసం భక్తులు ఆగస్టు 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవడానికి అవకాశం కల్పించారు. ఈ ఎలక్ట్రానిక్ డిప్ ద్వారా టికెట్లు పొందిన వారు ఆగస్టు 20 నుండి 22వ తేదీ మధ్యాహ్నం 12 గంటలలోపు డబ్బు చెల్లించినట్లయితే వారికి టికెట్లు ఖరారవుతాయి.
అదేవిధంగా కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవ మరియు పుష్పయాగం వంటి ఆర్జిత సేవా టికెట్లను ఆగస్టు 21వ తేదీ ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది. ఆ తర్వాత అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు వర్చువల్ సేవలు మరియు వాటి దర్శన స్లాట్లకు సంబంధించిన కోటాను ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచనున్నారు.
ఆగస్టు 24వ తేదీ ఉదయం 10 గంటలకు అంగ ప్రదక్షిణ టోకెన్ల కోటాను విడుదల చేయనుండగా, అదే రోజు ఉదయం 11 గంటలకు శ్రీవాణి ట్రస్టు దర్శన టికెట్ల కోటాను విడుదల చేస్తారు. అలాగే వయోవృద్ధులు, దివ్యాంగులు మరియు దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారు శ్రీవారిని సులభంగా దర్శించుకునేందుకు వీలుగా ఉచిత ప్రత్యేక దర్శన టోకెన్ల కోటాను ఆగస్టు 24వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది.
నవంబర్ నెలకు సంబంధించిన రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను ఆగస్టు 25వ తేదీ ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది. అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు తిరుమల మరియు తిరుపతిలలోని వసతి గదుల కోటాను ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నారు. భక్తులు టీటీడీ అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఈ శ్రీవారి ఆర్జిత సేవలు, దర్శన మరియు వసతి టికెట్లను బుక్ చేసుకోవాలని టీటీడీ కోరింది.