Ontimitta Sri Kodandaramaswamy: భక్తిరసంతో అలరించిన శ్రీ కోదండరాముని రథోత్సవం
శ్రీ కోదండరాముని రథోత్సవం
Ontimitta Sri Kodandaramaswamy: ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామివారి శ్రీరామనవమి బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం స్వామివారి రథోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది.
ఉదయం 10.30 గంటలకు ప్రారంభమైన ఈ రథోత్సవంలో శ్రీ సీతాలక్ష్మణ సమేత కోదండరాములవారు రథాన్ని అధిష్టించి గ్రామ వీధుల్లో విహరించి భక్తులను కటాక్షించారు. భజన బృందాలు చెక్కభజనలు, కోలాటాలతో ఆధ్యాత్మిక వాతావరణాన్ని మరింత భక్తిరసమయం చేశాయి. భక్తులు భక్తి శ్రద్ధలతో రథాన్ని లాగుతూ అడుగడుగునా కర్పూర నీరాజనాలు సమర్పించారు.
రథోత్సవానికి ఉన్న ఆధ్యాత్మిక ప్రాధాన్యం విశేషం. ఆత్మ రథికుడు, శరీరమే రథం, బుద్ధి సారథి, మనస్సు పగ్గం, ఇంద్రియాలే గుర్రాలు, విషయాలే వీధులని భావించి, ఆత్మ–అనాత్మ వివేకాన్ని గ్రహించేందుకు ఈ ఉత్సవం మార్గదర్శకంగా నిలుస్తుంది.
ఈ కార్యక్రమంలో టీటీడీ అదనపు ఈవో శ్రీ సిహెచ్ వెంకయ్య చౌదరి, జేఈవోలు శ్రీ వి వీరబ్రహ్మం, డా.ఎ.శరత్, డెప్యూటీ ఈవో శ్రీమతి ప్రశాంతి, టెంపుల్ ఇన్స్పెక్టర్ శ్రీ నవీన్, ఇంజినీరింగ్ అధికారులు మరియు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.