Lord Rama’s Son’s Temple in Pakistan: పాకిస్థాన్‌లోని లాహోర్ కోటలో ఉన్న శ్రీరాముడి కుమారుడు లవుడి (Prince Lava) ఆలయాన్ని పునరుద్ధరించారు. నిన్న (జనవరి 27) పునరుద్ధరించిన ఆలయాన్ని ప్రజల దర్శనం కోసం అధికారికంగా ఓపెన్ చేశారు.

పాకిస్థాన్ పంజాబ్ ప్రావిన్స్‌లోని చారిత్రాత్మక లాహోర్ కోట (షాహీ ఖిల్లా) లోపల ఈ 'లో దేవాలయం' (Loh Temple) ఉంది. వాల్డ్ సిటీ లాహోర్ అథారిటీ (WCLA), ఆగా ఖాన్ కల్చరల్ సర్వీస్ పాకిస్థాన్ సంయుక్తంగా ఈ ప్రాజెక్టును పూర్తి చేశాయి. దీనికి అమెరికా ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించింది.లవుడి ఆలయంతో పాటు సిక్కుల కాలం నాటి 'హమ్మామ్' (Royal Bath), మహారాజా రంజిత్ సింగ్ నిర్మించిన 'అత్ ద్వారా' (Athdara) పెవిలియన్‌ను కూడా అభివృద్ధి చేశారు.

లవుడికి, లాహోర్‌కు ఉన్న సంబంధం

శ్రీరాముడి కుమారుడైన లవుడు 'లవపురి' నగరాన్ని స్థాపించాడని, అదే కాలక్రమేణా 'లాహోర్' గా మారిందని హిందూ పురాణాలు చెబుతున్నాయి. అలాగే లవుడి సోదరుడు కుశుడు 'కసూర్' (ప్రస్తుతం పాకిస్థాన్‌లో ఉంది) నగరాన్ని స్థాపించాడని ప్రతీతి.

ఆలయ ప్రత్యేకతలు

ఈ ఆలయం కోట భూగర్భంలో ఉన్నట్లుగా ఉంటుంది. పునరుద్ధరణ సమయంలో తవ్వకాలు జరపగా మరికొన్ని గదులు, నడక దారులు బయటపడ్డాయి. ఇది ఓపెన్-టు-స్కై (ఆకాశం కనిపిస్తూ) ఉండే స్మారక మందిరం. ఇక్కడ వైష్ణవ, శైవ సంప్రదాయాలకు సంబంధించిన ఆనవాళ్లు కూడా లభించాయి. చాలా ఏళ్లుగా వర్షపు నీరు చేరి దెబ్బతిన్న ఈ నిర్మాణాన్ని అత్యాధునిక వాటర్‌ప్రూఫింగ్ పద్ధతులతో భద్రపరిచారు.

లాహోర్ కోటలో మొఘలుల మసీదులు, సిక్కుల కట్టడాలతో పాటు హిందూ దేవాలయాలు కూడా ఉండటం అక్కడి భిన్న సంస్కృతులకు ప్రతీకగా నిలుస్తుంది. పర్యాటకాన్ని ప్రోత్సహించడానికి సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడటానికి పాక్ ప్రభుత్వం ఈ చర్యలు తీసుకుంది.

Tags: