Sri Venkateswara Temple in Guwahati: గువాహటిలో శ్రీ‌వారి ఆల‌య‌ం.. 25 ఎకరాల భూమి కేటాయింపు

25 ఎకరాల భూమి కేటాయింపు

Update: 2025-12-22 05:15 GMT

Sri Venkateswara Temple in Guwahati: కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వేంకటేశ్వర స్వామివారి వైభవాన్ని ఈశాన్య భారతదేశంలో మరింత విస్తరించే దిశగా కీలక ముందడుగు పడింది. గువాహటి నగరంలో శ్రీ వేంకటేశ్వర స్వామి దివ్యక్షేత్రం నిర్మాణానికి తొలుత నిర్ణయించిన 10.8 ఎకరాల భూమికి బదులుగా 25 ఎకరాల భూమిని కేటాయించేందుకు అస్సాం ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అస్సాం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య జరిగిన సంప్రదింపుల అనంతరం ఈ కీలక నిర్ణయం వెలువడింది.

టీటీడీ ట్రస్ట్ బోర్డు చైర్మన్ శ్రీ బీ.ఆర్.నాయుడు తెలిపిన వివరాల ప్రకారం గువాహటి సమీపంలోని కామ్రూప్ మెట్రోపాలిటన్ జిల్లాలో 10.8 ఎకరాల భూమిని కేటాయించేందుకు అస్సాం ప్రభుత్వం గతంలోనే అంగీకారం తెలిపింది. అయితే డిసెంబర్ 7న అస్సాం ప్ర‌భుత్వ‌ అదనపు ప్రధాన కార్యదర్శి శ్రీ కేకే ద్వివేది టీటీడీ చైర్మన్ శ్రీ బీ.ఆర్‌.నాయుడుకు లేఖ రాస్తూ గువాహటిలోని గర్చుక్ ప్రాంతంలో ఇప్పటికే ఉన్న శ్రీవారి ఆలయం మరియు సాంస్కృతిక సముదాయం నిర్వాహకుల సూచనలను చైర్మ‌న్‌ దృష్టికి తీసుకువ‌చ్చారు. కామ్రూప్ మెట్రోపాలిటన్ జిల్లాలో టీటీడీ శ్రీ వేంకటేశ్వర ఆలయం నిర్మిస్తే, అక్కడ ఉన్న ఆలయ ప్రయోజనాలకు భంగం కలగవచ్చని వారు అభిప్రాయపడ్డారు.

ఈ నేపథ్యంలో శ్రీ వేంకటేశ్వర ఆలయాన్ని అస్సాంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న సిల్చార్ లేదా డిబ్రూగఢ్ నగరాల్లో ఏర్పాటు చేయాలని అస్సాం సీఎం అదనపు ప్రధాన కార్యదర్శి సూచించారు. ఈ విషయాన్ని టీటీడీ చైర్మన్ శ్రీ బీ.ఆర్.నాయుడు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకువెళ్లగా, ఆయన డిసెంబర్ 18న అస్సాం ముఖ్యమంత్రి డాక్టర్ హిమంత బిశ్వ శర్మకు లేఖ రాశారు. దేశంలోని ప్రతి రాష్ట్రం మరియు కేంద్రపాలిత ప్రాంతంలో కనీసం ఒక శ్రీ వేంకటేశ్వర ఆలయాన్ని స్థాపించడం ద్వారా హిందూ సనాతన ధర్మం, శ్రీ వేంకటేశ్వర స్వామివారి మ‌హిమ‌ను విస్తరించాలన్నది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరియు టీటీడీ యొక్క నిబద్ధతగా ఆ లేఖలో పేర్కొన్నారు.

ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధాని అమరావతిలో శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం 25 ఎకరాల భూమిని కేటాయించిన విషయాన్ని అస్సాం ముఖ్యమంత్రికి గుర్తు చేస్తూ, సిల్చార్ లేదా డిబ్రూగఢ్ బదులుగా అస్సాం రాజధాని గువాహటిలోనే టీటీడీకి 25 ఎకరాల భూమి కేటాయించాలని ఏపీ సీఎం కోరారు. ఈశాన్య భారతదేశానికి గువాహటి ప్రధాన కేంద్రంగా ఉన్నందున, భక్తుల సౌకర్యాలు, నిత్య అన్నదానం వంటి ధార్మిక కార్యక్రమాలతో కూడిన దివ్యక్షేత్రాన్ని ఏర్పాటు చేయడానికి సుమారు 25 ఎకరాల భూమిని కేటాయించాలని సిఫార్సు చేశారు. అలాగే ప్రతిపాదిత స్థలంలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేందుకు అస్సాం ప్రభుత్వం ఆర్థిక సహకారం కూడా అందించాలని ఏపీ సీఎం తన లేఖలో పేర్కొన్నారు.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చేసిన సూచనలకు సానుకూలంగా స్పందించిన అస్సాం ముఖ్యమంత్రి గువాహటిలోనే టీటీడీకి 25 ఎకరాల భూమిని కేటాయించేందుకు సూత్రప్రాయంగా ఆమోదం తెలిపారు. అలాగే ప్రతిపాదిత ప్రాజెక్టు అభివృద్ధి కార్యక్రమాలకు అవసరమైన ఆర్థిక సహాయాన్ని కూడా అందించేందుకు అంగీకరించారు.

Tags:    

Similar News