Devavrata (Bhishma): శంతనుడు భార్య ఎవరు ? దేవవ్రతుడు ఎలా పుట్టాడు?
ఎలా పుట్టాడు?
Devavrata (Bhishma): మహాభారత కథ ప్రకారం చంద్రవంశానికి చెందిన హస్తినాపుర మహారాజైన శంతనుడికి ఇద్దరు భార్యలు ఉన్నారు. ఆయన మొదటి భార్య గంగాదేవి కాగా, రెండవ భార్య సత్యవతి.
దేవవ్రతుడి (భీష్ముడి) జననం వెనుక ఒక ప్రత్యేకమైన పౌరాణిక ఘట్టం దాగి ఉంది. శంతనుడు గంగాదేవిని వివాహం చేసుకునేటప్పుడు, తాను ఏమి చేసినా ప్రశ్నించకూడదని, ఒకవేళ ప్రశ్నిస్తే తనను విడిచిపెట్టి వెళ్ళిపోతానని ఆమె షరతు విధిస్తుంది. శంతనుడు దానికి అంగీకరిస్తాడు. పూర్వజన్మలో వసిష్ఠ మహర్షి ఇచ్చిన శాపం వల్ల భూమిపై జన్మించాల్సి వచ్చిన అష్టవసువులే గంగాదేవి కడుపున సంతానంగా జన్మిస్తారు. శాపవిమోచనంలో భాగంగా గంగాదేవి తనకు పుట్టిన మొదటి ఏడుగురు పిల్లలను పుట్టగానే గంగానదిలో కలిపివేస్తుంది. శంతనుడు తన మాట ప్రకారం ఆ ఏడుగురి విషయంలో ఏమీ మాట్లాడలేక మౌనంగా ఉండిపోతాడు.
అయితే ఎనిమిదవ సంతానంగా జన్మించిన బాలుడిని కూడా గంగాదేవి నదిలో పడేయడానికి సిద్ధపడినప్పుడు, శంతనుడు ఇక ఓపిక పట్టలేక ఆమెను అడ్డుకుని వార్నింగ్ ఇస్తాడు. ఆ బాలుడిని చంపవద్దని బ్రతిమాలుతాడు. శంతనుడు తన షరతును ఉల్లంఘించడంతో, గంగాదేవి ఆ ఎనిమిదవ బాలుడిని ప్రాణాలతో ఉంచి, ఆ బాబును తనతో పాటు తీసుకుని వెళ్ళిపోతుంది. ఆ ఎనిమిదవ పుత్రుడే అష్టవసువులలో ఒకడైన ప్రభాసుడి అంశతో జన్మించిన దేవవ్రతుడు. గంగాదేవి ఆ బాలుడిని తీసుకెళ్లి సమస్త వేదాలు, శాస్త్రాలు, ధనుర్విద్యలను దివ్య గురువుల వద్ద నేర్పించి, యవ్వనంలో ఉన్న దేవవ్రతుడిని తిరిగి శంతనుడికి అప్పగిస్తుంది. ఈ దేవవ్రతుడే తదనంతర కాలంలో పితృభక్తితో కఠినమైన భీష్మ ప్రతిజ్ఞ చేసి 'భీష్ముడు'గా ప్రసిద్ధి చెందుతాడు.