Durmuhurtham: హిందూ సనాతన ధర్మంలో ఏదైనా ముఖ్యమైన పని లేదా శుభకార్యం ప్రారంభించే ముందు పంచాంగం చూడటం అనాదిగా వస్తున్న ఆచారం. తిథి, వారం, నక్షత్రం, యోగం, కరణం అనే ఐదు అంగాల కలయికతో రూపొందే పంచాంగంలో శుభ ఘడియలతో పాటు కొన్ని అశుభ సమయాలనూ స్పష్టంగా పేర్కొంటారు. అందులో ప్రధానమైనది దుర్ముహూర్తం. రాహుకాలం, యమగండం మాదిరిగానే దుర్ముహూర్తానికి కూడా పంచాంగ గణనలో ఎంతో ప్రాధాన్యత ఉంది. విజయాలు సాధించాలన్నా, చేపట్టిన పనులు ఆటంకాలు లేకుండా పూర్తవ్వాలన్నా ఈ కాలాన్ని ఎందుకు విస్మరించకూడదో వేద పండితులు, జ్యోతిష నిపుణులు వివరిస్తున్నారు.

దుర్ముహూర్తం అంటే ఏమిటి?

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు ఉండే పగటి సమయాన్ని, అలాగే సూర్యాస్తమయం నుంచి మరుసటి రోజు సూర్యోదయం వరకు ఉండే రాత్రి సమయాన్ని ఒక్కొక్కటి 15 ముహూర్తాలుగా విభజిస్తారు. అంటే ఒక రోజులో మొత్తం 30 ముహూర్తాలు ఉంటాయి. ఒక ముహూర్తం అంటే సుమారు 48 నిమిషాల కాలం. ఈ 30 ముహూర్తాలలో కొన్ని శుభ ఫలితాలనిచ్చేవి ఉండగా, మరికొన్ని ప్రతికూల శక్తుల ప్రభావం అధికంగా ఉండే కాలాలు ఉంటాయి. ప్రతికూల ప్రభావం అధికంగా ఉండే ఆ నిర్దిష్ట సమయాన్నే దుర్ముహూర్తం అంటారు. వారంలోని ఏడు రోజుల్లో ఒక్కో రోజు ఈ సమయం వేర్వేరు వేళల్లో వస్తుంది. కొన్ని రోజుల్లో పగటిపూట రెండుసార్లు కూడా దుర్ముహూర్తం ఏర్పడుతుంది.

దుర్ముహూర్తంలో ఏ పనులు చేయకూడదు?

ఈ సమయంలో ప్రారంభించే పనులకు గ్రహాల అనుకూలత లోపించి, అడ్డంకులు లేదా వైఫల్యాలు ఎదురయ్యే అవకాశం ఉంటుందని విశ్వసిస్తారు. అందువల్ల ఈ కింది పనులను నివారిస్తారు.

శుభకార్యాలు:

వివాహం, నిశ్చితార్థం, ఉపనయనం, గృహప్రవేశం వంటి శుభకార్యాలను ఈ సమయంలో ప్రారంభించరు.

నూతన ప్రారంభాలు: కొత్త వ్యాపారాలు ప్రారంభించడం, ఉద్యోగంలో చేరడం, ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టడం వంటివి చేయకూడదు.

ఆర్థిక లావాదేవీలు: పెద్ద మొత్తంలో రుణాలు ఇవ్వడం, తీసుకోవడం లేదా విలువైన ఒప్పందాలపై సంతకాలు చేయడం నిషిద్ధం.

ప్రయాణాలు - కొనుగోళ్లు:

ముఖ్యమైన సుదూర ప్రయాణాలు మొదలుపెట్టడం, నూతన స్థలాలు, ఆస్తులు లేదా వాహనాలు కొనుగోలు చేయడానికి ఈ సమయం అనుకూలం కాదు.

ఎలాంటి పనులు చేసుకోవచ్చు?

దుర్ముహూర్తం కేవలం భౌతికపరమైన నూతన శుభకార్యాల ప్రారంభానికి మాత్రమే వర్తించదు అనుకూలం కాదు. అయితే.. నిత్యం జరిగే సాధారణ దినచర్యలు, రోజువారీ విధులు యథావిధిగా నిర్వహించుకోవచ్చు. ఇప్పటికే కొనసాగుతున్న పనులకు ఇది వర్తించదు. ఇష్టదైవ ప్రార్థన, గాయత్రీ జపం, ధ్యానం, ఆరాధన వంటి ఆధ్యాత్మిక సాధనలకు ఎటువంటి ముహూర్త దోషాలు వర్తించవు.

Tags: