Srivari Garuda Seva: శ్రీవారి గరుడసేవకు శ్రీవిల్లిపుత్తూరు గోదాదేవి మాలలు
మాలలు
Srivari Garuda Seva: తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో అత్యంత విశిష్టమైన గరుడసేవ సందర్భంగా శ్రీమలయప్పస్వామివారికి అలంకరించేందుకు తమిళనాడులోని శ్రీవిల్లిపుత్తూరు నుంచి గోదాదేవి మాలలు శుక్రవారం తిరుమలకు చేరుకున్నాయి.
ముందుగా ఈ మాలలను తిరుమలలోని శ్రీ బేడి ఆంజనేయస్వామివారి ఆలయం వద్దనున్న శ్రీ పెద్దజీయర్ మఠానికి తీసుకువచ్చారు. శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్ స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్ స్వామి ఆధ్వర్యంలో మాలలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మంగళవాయిద్యాల నడుమ మాడవీధుల గుండా ఊరేగింపుగా శ్రీవారి ఆలయానికి తీసుకెళ్లారు.
రెండు కుటుంబాల నుంచి ఆండాళ్, శిఖామణి మాలలు
ఆండాళ్ మాల, శిఖామణి మాలగా పిలువబడే ఈ రెండు విశిష్ట పుష్పమాలలను తిరుపతికి సుమారు 650 కిలోమీటర్ల దూరంలోని శ్రీవిల్లిపుత్తూరుకు చెందిన రెండు కుటుంబాల పూల తయారీదారులు సంప్రదాయబద్ధంగా సమర్పిస్తున్నారు.
గోదాదేవి మాలలకు విశిష్ట ఆధ్యాత్మిక ప్రాశస్త్యం
శ్రీవిల్లిపుత్తూరులో గోదాదేవికి అలంకరించిన పుష్పమాలను గరుడసేవ రోజున శ్రీవారికి అలంకరించడం అనాదిగా వస్తున్న సంప్రదాయం.
పురాణ కథనాల ప్రకారం, శ్రీరంగమన్నార్ స్వామివారికి పుష్పకైంకర్యం చేసిన శ్రీ పెరియాళ్వార్ కుమార్తె గోదాదేవి, స్వామివారిపై అపారమైన భక్తితో పుష్పమాలను ముందుగా తాను ధరించి, అనంతరం స్వామివారికి సమర్పించేవారు. గోదాదేవి భక్తిని గుర్తించిన శ్రీరంగనాథుడు, ఆమె ధరించిన మాలలనే స్వీకరించారని భక్తుల విశ్వాసం. గోదాదేవిని శ్రీవారి దేవేరి అయిన భూదేవి అవతారంగా భావిస్తారు.
ఈ పవిత్ర సంప్రదాయం గరుడసేవకు మరింత ఆధ్యాత్మిక శోభను చేకూర్చుతోంది.