Achamanam Performed Before Puja: తెలుగువారి ఇళ్లలో నిత్య పూజ అయినా, సంధ్యావందనం లేదా ఏదైనా శుభకార్యం జరిగినా పండితులు ముందుగా చెప్పే మాట "ఆచమనం చేయండి". అయితే చాలామంది ఇది కేవలం చేతులు కడుక్కోవడం లేదా నీళ్లు తాగడం మాత్రమే అనుకుంటారు. కానీ ఆచమనం అనేది కేవలం బాహ్య ప్రక్షాళన మాత్రమే కాదు, శరీరంతో పాటు మనస్సు, వాక్కులను కూడా పవిత్రం చేసే గొప్ప వైదిక ప్రక్రియ.

ఆచమనం అంటే ఏమిటి?

ఆచమనం అంటే మంత్రోచ్ఛారణ చేస్తూ ప్రత్యేక పద్ధతిలో నీటిని స్వీకరించడం. ధర్మశాస్త్రాల ప్రకారం, దైవ పూజలు లేదా జపాలు చేసే సమయంలో మనస్సు, శరీరం పూర్ణ పవిత్రతతో ఉండాలి. ఆ పవిత్రతను సిద్ధించేందుకే ప్రతి పూజా విధికి ముందు ఆచమనాన్ని ప్రథమ కర్తవ్యంగా నిర్దేశించారు.

ఆచమనం చేసే సరైన పద్ధతి

తెలుగు సాంప్రదాయం ప్రకారం ఆచమనం చేయడానికి కొన్ని నియమాలు ఉన్నాయి..

చేతి ముద్ర:

కుడిచేతి బొటనవేలు, చూపుడు వేలు మినహా మిగిలిన మూడు వేళ్లను వంచి గోకర్ణ ముద్ర పెట్టాలి.

నీటి పరిమాణం:

ఉద్ధరిణితో కుడిచేతి అరచేతిలో ఒక మినుము గింజ మునిగేంత నీటిని మాత్రమే పోసుకోవాలి.

స్వీకరించే పద్ధతి:

పెదవులకు నీటి పాత్ర గానీ, వేళ్లు గానీ తాకకుండా శబ్దం రాకుండా నీటిని తాగాలి.

స్వీకరించే మంత్రాలు

ఓం కేశవాయ స్వాహా:

ఓం నారాయణాయ స్వాహా..

ఓం మాధవాయ స్వాహా

ఈ మూడు నామాలు చదివిన తర్వాత ఓం గోవిందాయ నమః, ఓం విష్ణవే నమః అని చెబుతూ చేతులు కడుక్కోవాలి. ఆ తర్వాత కేశవాది 24 విష్ణు నామాలను స్మరిస్తూ శరీరంలోని వివిధ భాగాలను స్పృశిస్తారు.

ఆచమనం వెనుక ఉన్న ప్రాముఖ్యత - నియమాలు

త్రివిధ శుద్ధి:

మూడుసార్లు నీటిని స్వీకరించడం వల్ల వాక్కు, మనస్సు, శరీరం పవిత్రమవుతాయి.

ఏ దిశలో కూర్చోవాలి?:

ఆచమనం చేసే సమయంలో తూర్పు లేదా ఉత్తర దిశకు అభిముఖంగా కూర్చోవాలి.

ఎప్పుడు చేయకూడదు?:

నిలబడి గానీ, పాదరక్షలు ధరించి గానీ, తలకు గుడ్డ చుట్టుకుని గానీ ఆచమనం చేయకూడదు.

ఆచమనం చేయకుండా చేసే ఏ పూజ లేదా జపమైనా పరిపూర్ణమైన ఫలితాన్ని ఇవ్వదని శాస్త్రాలు చెబుతున్నాయి. కాబట్టి ప్రతీరోజూ నిత్య పూజలో ఆచమనాన్ని నియమబద్ధంగా ఆచరించడం ద్వారా భగవంతుని కృపను, మానసిక ప్రశాంతతను పొందవచ్చు.

Tags: