Main Doors Open on Diwali Night: చీకటిపై వెలుగు, అజ్ఞానంపై జ్ఞానం, నిరాశపై ఆశ సాధించిన విజయానికి ప్రతీకగా జరుపుకునే దివ్య పండుగ దీపావళి. దేశవ్యాప్తంగా ప్రజలంతా ఇళ్లను శుభ్రం చేసుకుని, రంగురంగుల దీపాలు, తోరణాలతో ముస్తాబు చేసి లక్ష్మీదేవి, గణపతి దేవుళ్లను భక్తిశ్రద్ధలతో కొలుస్తారు. అయితే దీపావళి రోజున పాటించే ప్రతి ఆచారం వెనుక లోతైన ఆధ్యాత్మిక, వాస్తు విశిష్టతలు దాగి ఉన్నాయని పండితులు చెబుతుంటారు. ముఖ్యంగా ఇంటి ప్రధాన ద్వారం వద్ద దీపాలు పెట్టడం, రాత్రి వేళ తలుపులు తెరిచి ఉంచడం వెనుక ఆసక్తికరమైన కారణాలు ఉన్నాయి.

సింహద్వారం వద్ద దీపాలు ఎందుకు వెలిగించాలి?

వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటి ప్రధాన ద్వారాన్ని ఆ గృహానికి ‘ముఖం’గా భావిస్తారు. సానుకూల శక్తులు, అతిథులు, ఐశ్వర్యం మొదటగా ప్రవేశించేది ఇక్కడి నుంచే.

లక్ష్మీదేవి రాకకు సంకేతం: ఆధ్యాత్మిక విశ్వాసాల ప్రకారం, దీపావళి రాత్రి వేళ లక్ష్మీదేవి భూలోకంలో సంచరిస్తూ పరిశుభ్రంగా, దీపాల కాంతులతో వెలిగిపోయే ఇళ్లలోకి ప్రవేశిస్తుందని నమ్ముతారు.

పాజిటివ్ ఎనర్జీ:

ప్రధాన గుమ్మానికి ఇరువైపులా నెయ్యి లేదా ఆవనూనెతో దీపాలు వెలిగించి ఉంచడం వల్ల ఇంట్లోకి దుష్ట శక్తులు రాకుండా, శుభశక్తులు ప్రవేశిస్తాయి.

దీపావళి రాత్రి తలుపులు ఎందుకు తెరిచి ఉంచాలి?

జ్యోతిష్య, వాస్తు సంప్రదాయాల ప్రకారం దీపావళి నాటి సాయంత్రం ప్రదోష కాలం నుంచి అర్ధరాత్రి నిశీతి సమయం వరకు ప్రధాన ద్వారాలను తెరిచి ఉంచడం అత్యంత శుభప్రదంగా పరిగణిస్తారు. మూసి ఉన్న తలుపుల కంటే, దీపాలతో వెలిగిపోతూ తెరిచి ఉన్న ద్వారాలే లక్ష్మీదేవిని, సిరిసంపదల అధిపతి అయిన కుబేరుడిని సాదరంగా ఆహ్వానించడానికి సూచికగా భావిస్తారు. అమ్మవారి అనుగ్రహం వల్ల ఇంట్లో దారిద్ర్యం తొలగిపోయి సుఖశాంతులు, శ్రేయస్సు, ధనధాన్యాలు సమృద్ధిగా చేకూరుతాయని భక్తుల బలమైన నమ్మకం.

రాత్రంతా తలుపులు తెరిచి ఉంచడం సాధ్యం కాకపోతే?

ప్రస్తుత రోజుల్లో భద్రతా కారణాల దృష్ట్యా అందరికీ రాత్రంతా ప్రధాన తలుపులు తెరిచి ఉంచడం సాధ్యం కాకపోవచ్చు. అలాంటి వారు ఈ ప్రత్యామ్నాయాన్ని పాటించవచ్చని పెద్దలు సూచిస్తున్నారు. సింహద్వారం మూసివేసినప్పటికీ, ప్రధాన ద్వారం బయట రాత్రంతా కొండెక్కిపోకుండా వెలిగేలా ఒక పెద్ద అఖండ దీపాన్ని ఏర్పాటు చేసుకోవచ్చు. ద్వారం ముందు ముగ్గులు వేసి, పూలతో అలంకరించి నిరంతరం వెలుగు ఉండేలా చూసుకుంటే తలుపులు తెరిచి ఉంచినంతటి శుభ ఫలితాలు లభిస్తాయి.

దీపావళి నాడు పాటించే ఈ పవిత్ర నియమాలు కేవలం ఆచారాలు మాత్రమే కాకుండా, మన జీవితాల్లోని అంధకారాన్ని పారద్రోలి సకల సంపదలు, వెలుగులు నింపే ఆధ్యాత్మిక సంకల్పాలని వేద పండితులు స్పష్టం చేస్తున్నారు.

Tags: