Nursing Common Examination Test : నర్సింగ్ కోర్సుల ప్రవేశాల్లో సంస్కరణలు
మేనేజ్‌మెంట్ కోటా ప్రవేశాలను కూడా చేపట్టనున్న డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ;
మొదటిసారిగా ప్రత్యేక పరీక్ష ద్వారా అడ్మిషన్లు
ప్రతిభ కలిగిన విద్యార్థులకు పెద్దపీట వేయడంతోపాటు, నాలుగేళ్ల వ్యవధితో కూడిన బియస్సీ నర్సింగ్ కోర్సు ప్రవేశాల్లో అవకతవకలకు తావులేకుండా చూసేందుకు కూటమి ప్రభుత్వం సంస్కరణలు ప్రవేశపెట్టింది. 2025-26 విద్యా సంవత్సరంలో జరిగే ప్రవేశాలతో ఈ సంస్కరణలు అమల్లోకి రానున్నాయి. ఈ మేరకు బియస్సీ (నర్సింగ్) కోర్సులో ప్రవేశాలకు సంబంధించి 1998లో జారీ అయిన జీఒ నంబరు 145 మరియు 2023లో జారీ అయిన జీఓ నంబరు 41ల్లో తగు మార్పులు చేయడానికి వైద్యారోగ్య శాఖామంత్రి సత్యకుమార్ యాదవ్ ఆమోదం తెలిపారు. ఈ విషయానికి సంబంధించి ఉన్నతాధికారులతో పలు అంశాలను సమీక్షించిన అనంతరం మంత్రి ఆమోదం తెలిపారు.
ఇప్పటి వరకు నాలుగేళ్ల బియస్సీ(నర్సింగ్) కోర్సులో ఎంసెట్ ర్యాంకుల ఆధారంగాను, ఇంటర్మీడియేట్ మార్కుల ప్రాతిపదికన ప్రవేశాలు జరిగాయి. మొదటిసారిగా గత ఏడాది జులైలో బియస్సీ(నర్సింగ్)లో ప్రవేశాల కోసం ఆంధ్రప్రదేశ్ నర్సింగ్ కామన్ ఎగ్జామినేషన్ టెస్ట్‌ను(ఎపిఎన్ సెట్) డాక్టర్ ఎన్టీఆర్ వైద్య విజ్క్షాన విశ్వవిద్యాలయం నిర్వహించింది. ఈ పరీక్షలో వచ్చిన ర్యాంకుల ఆధారంగా ఈ విద్యా సంవత్సరంలో ప్రవేశాలు జరుగుతాయి. ఇప్పటి వరకు ప్రైవేట్ కళాశాలల్లో కన్వీనర్ కోటాలో ప్రవేశాలను డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ నిర్ణయిస్తూ ఉండగా, మేనేజ్‌మెంట్ కోటాలో ప్రవేశాలను ఆయా కళాశాలల యాజమాన్యాలు నిర్ణయించేవి. తద్వారా ప్రతిభ తక్కువ కలిగిన విద్యార్థులకు, ఇతర రాష్ట్రాల వారికి మేనేజ్‌మెంట్ కోటాలో ప్రవేశాలు లభించేవని ఆరోపణలొచ్చాయి.
ఈ నేపథ్యంలో ప్రభుత్వ, ప్రైవేట్ నర్సింగ్ కళాశాలల్లో కన్వీనర్ కోటాలో ప్రవేశాలతో పాటు ప్రైవేట్ నర్సింగ్ కళాశాలల్లోని మేనేజ్‌మెంట్ సీట్లకు కూడా డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ఆన్‌లైన్ వెబ్ కౌన్సిలింగ్ ద్వారా ప్రవేశాలు చేపట్టనుంది. విశ్వవిద్యాలయం నియమించే సెలక్షన్ కమిటీ ప్రతిభ ఆధారంగా ఎంపిక చేసిన విద్యార్థులనే మేనేజ్‌మెంట్ సీట్లలో చేర్చుకోవాల్సి ఉంటుంది. ఈ సంస్కరణతో ప్రతిభ కలిగిన విద్యార్థులకు నర్సింగ్ కోర్సులో ప్రవేశాలు లభిస్తాయని మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు.
ప్రవేశానికి అర్హతలు
నాలుగేళ్ల బియస్సీ(నర్సింగ్) కోర్సులో ప్రవేశం పొందడానికి...సాధారణ తరగతులకు(అన్ రిజర్వ్‌డ్) చెందిన వారు ఎపిఎన్‌సెట్ పరీక్ష రాసిన వారిలో 50 పర్సంటైల్‌లో ఉండాలి(అనగా ఎపిఎన్‌సెట్ పరీక్ష రాసిన వారిలో 50 శాతం వారు పొందిన మార్కుల కంటే ఎక్కువ పొంది ఉండాలి). సాధారణ తరగతులకు చెందిన దివ్యాంగులు 45 పర్సంటైల్ లో ఉండాలి(45 శాతం వారు సాధించిన మార్కుల కంటే ఎక్కువ పొంది ఉండాలి). ఎస్సీ,ఎస్టీ, ఓబీసీ తరగతులకు చెందిన వారు, ఈ తరగతులకు చెందిన దివ్యాంగులు 40 పర్సంటైల్ లో ఉండాలి. ఇదిలా ఉండగా రాష్ట్రంలో బియస్సీ(నర్సింగ్) విద్యను అందించే కళాశాలల్లో మొత్తంగా 13,726 సీట్లుండగా...2024-25 విద్యా సంవత్సరంలో కన్వీనర్ కోటాలో 6,441 మంది విద్యార్థులు ప్రవేశాలు తీసుకోగా, మేనేజ్‌మెంట్ కోటాలో 5,144 మంది ప్రవేశాలు పొందారు. 2,141 సీట్లు మిగిలిపోయాయి.