Diet to Beat the Summer Heat: మార్చి నెల ప్రారంభంతోనే భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. ఉష్ణోగ్రతలు పెరుగుతున్న కొద్దీ శరీరంలో నీటి శాతం తగ్గి నీరసం, అలసట, డీహైడ్రేషన్ వంటి సమస్యలు తలెత్తుతాయి. ఈ వేసవిలో కేవలం నీళ్లు తాగడమే కాకుండా శరీరానికి చలవ చేసే పండ్లను తీసుకోవడం ద్వారా ఆరోగ్యంగా ఉండవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.

శరీరాన్ని చల్లబరిచే అద్భుతమైన పండ్లు ఇవే:

పుచ్చకాయ: ఇందులో సుమారు 92% నీరు ఉంటుంది. ఇది శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచడమే కాకుండా ఇందులోని యాంటీఆక్సిడెంట్లు చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. వేసవిలో ఇది ఒక అమృతం లాంటిది.

దోసకాయ : దోసకాయలో ఉండే ఎలక్ట్రోలైట్లు శరీరాన్ని లోపల నుండి చల్లబరుస్తాయి. ఇది జీర్ణక్రియను మెరుగుపరచడంలో కూడా కీలక పాత్ర పోషిస్తుంది.

దానిమ్మ: ఇందులో ఇనుము పుష్కలంగా ఉండటం వల్ల రక్తహీనతను తగ్గిస్తుంది. అలాగే వేసవిలో వచ్చే మలబద్ధకం, కడుపు నొప్పి వంటి జీర్ణ సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుంది.

నారింజ: విటమిన్-సి అధికంగా ఉండే నారింజ రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఎండ వల్ల కలిగే అలసటను తగ్గించి శరీరానికి తక్షణ శక్తిని ఇస్తుంది.

ద్రాక్ష : ద్రాక్షలో 70 శాతం కంటే ఎక్కువ నీరు ఉంటుంది. ఇవి తియ్యగా, పుల్లగా ఉండి తినడానికి రుచిగా ఉండటమే కాకుండా వడదెబ్బ తగలకుండా కాపాడతాయి.

బొప్పాయి: ఇది జీర్ణ వ్యవస్థను చురుగ్గా ఉంచుతుంది. శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపి చల్లదనాన్ని ఇస్తుంది.

లిచీ: ఇందులో విటమిన్-సి, బి-కాంప్లెక్స్ అధికంగా ఉంటాయి. ఇవి శరీరానికి కావాల్సిన శక్తిని అందిస్తూ చలవ చేస్తాయి.

ప్రకృతి ప్రసాదించిన పానీయం: కొబ్బరి నీరు

శరీరాన్ని సహజంగా నిర్విషీకరణ చేయడానికి కొబ్బరి నీరు అత్యుత్తమ మార్గం. ఇందులో ఉండే సహజసిద్ధమైన ఎలక్ట్రోలైట్లు అలసటను దూరం చేసి, శరీరాన్ని రోజంతా ఉత్సాహంగా ఉంచుతాయి.

వేసవిలో కేవలం దాహం వేసినప్పుడే కాకుండా క్రమం తప్పకుండా పండ్లు లేదా పండ్ల రసాలు తీసుకోవడం ద్వారా వడదెబ్బ బారి నుండి తప్పించుకోవచ్చు.

Tags: