Lower Back Pain: నడుము నొప్పితో బాధపడేవారికి బిగ్ అలెర్ట్!
బాధపడేవారికి బిగ్ అలెర్ట్!
Lower Back Pain: నడుము నొప్పితో బాధపడేవారికి ఊరటనిచ్చే వార్త ఇది. వంగడం, బరువులు నెట్టడం వంటి శారీరక శ్రమల వల్ల తాత్కాలికంగా నడుము నొప్పి పెరిగినప్పటికీ, అది దీర్ఘకాలికంగా ఎటువంటి హాని చేయదని తాజా పరిశోధనలో తేలింది. అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ వాషింగ్టన్, ఆస్ట్రేలియాకు చెందిన పరిశోధక బృందాలు సంయుక్తంగా నిర్వహించిన ఈ అధ్యయన వివరాలు ఎంటో ఇప్పుడు చూద్దాం.
నడుము నొప్పి ఉన్నవారు బరువులు ఎత్తడం, వంగడం లేదా ట్విస్టింగ్ చేయడం వల్ల వెన్నుపూస దెబ్బతింటుందని భయపడుతుంటారు. అయితే, ఈ పనులు చేయడం వల్ల నొప్పి కేవలం తాత్కాలికంగా మాత్రమే పెరుగుతుందని, దీర్ఘకాలంలో వీటి వల్ల ఎటువంటి శారీరక వైకల్యం లేదా నష్టం కలగదని పరిశోధకులు స్పష్టం చేశారు. ఒక ఏడాది పాటు 400 మందిపై నిర్వహించిన ఈ సర్వేలో ప్రతిరోజూ చేసే పది రకాల కదలికలను నిశితంగా పరిశీలించారు.
4.5 కేజీల కంటే ఎక్కువ బరువు ఎత్తడం, వంగడం, నెట్టడం లేదా లాగడం, పాకడం వంటి పనులు చేసినప్పుడు తక్షణమే నొప్పి పెరిగే అవకాశం ఉంది. మిగిలిన పనులతో పోలిస్తే, కూర్చుని చేసే పనుల వల్ల నొప్పి తక్షణమే పెరిగే ముప్పు తక్కువగా ఉన్నట్లు గుర్తించారు. మొదటి ఎనిమిది వారాల పాటు ఈ పనులు చేసిన వారిని ఏడాది తర్వాత పరీక్షించగా, వారిలో ఎటువంటి శాశ్వత నడుము సమస్యలు లేదా శారీరక పరిమితులు కనిపించలేదు.
శారీరక కదలికలు సాధారణంగా నడుము ఆరోగ్యానికి మేలు చేస్తాయనే ప్రజారోగ్య సందేశాన్ని ఈ అధ్యయనం బలపరుస్తోంది. "కొన్ని పనులు చేసినప్పుడు నొప్పి వస్తుందనే భయంతో కదలకుండా ఉండాల్సిన అవసరం లేదు. ఆ నొప్పి కేవలం తాత్కాలికమే. దీర్ఘకాలంలో శారీరక శ్రమ వల్ల వెన్నుపూసకు ప్రమాదమేమీ ఉండదు" అని పరిశోధకులు వెల్లడించారు. ఈ ఫలితాలు నడుము నొప్పితో బాధపడేవారు ధైర్యంగా తమ దైనందిన పనులను నిర్వహించుకోవడానికి సహాయపడతాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.