Thyroid Problems Prevent Childbirth: థైరాయిడ్ సమస్యలుంటే పిల్లలు పుట్టరా?

పిల్లలు పుట్టరా?

Update: 2026-01-30 10:24 GMT

Thyroid Problems Prevent Childbirth: నేటి కాలంలో మారుతున్న జీవనశైలి కారణంగా చాలామంది మహిళలు థైరాయిడ్ సమస్యను ఎదుర్కొంటున్నారు. అయితే, థైరాయిడ్ ఉంటే పిల్లలు పుట్టరనే ఆందోళన చాలామందిలో ఉంటుంది. నిజానికి, శరీరంలో థైరాక్సిన్ హార్మోన్ స్థాయులు తగ్గడం వల్ల 'ప్రొలాక్టిన్' అనే హార్మోన్ పెరిగిపోతుంది. దీని ప్రభావంతో అండం విడుదల ప్రక్రియలో ఆటంకాలు ఏర్పడి, గర్భం ధరించడం కష్టమవుతుంది. క్రమం తప్పని బహిష్టు సమస్యలు కూడా సంతానలేమికి ఒక కారణంగా మారుతుంటాయి.

థైరాయిడ్ సమస్య ఉన్నప్పటికీ, సరైన సమయంలో దానిని గుర్తించి వైద్యుల పర్యవేక్షణలో చికిత్స తీసుకుంటే ఖచ్చితంగా సంతానం పొందే అవకాశం ఉంటుంది. థైరాయిడ్ మందులు వాడుతూ హార్మోన్ సమతుల్యతను కాపాడుకోవడం ద్వారా గర్భధారణకు మార్గం సుగుమం అవుతుంది. కేవలం గర్భం దాల్చడమే కాకుండా, గర్భం దాల్చిన తర్వాత కూడా వైద్యుల సలహాతో మందులను కొనసాగించడం వల్ల ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఆరోగ్యకరమైన బిడ్డకు జన్మనివ్వవచ్చు.

శరీరంలోని జీవక్రియల పనితీరు బాగుండాలంటే థైరాయిడ్ హార్మోన్లు సవ్యంగా విడుదలవ్వాలి. వీటిలో హెచ్చుతగ్గులు వచ్చినప్పుడు కేవలం మందులపైనే కాకుండా ఆహారపు అలవాట్లపై కూడా దృష్టి సారించాలని నిపుణులు సూచిస్తున్నారు. ఆహారంలో అయోడిన్ కలిగిన ఉప్పును వాడటంతో పాటు, శరీరానికి అవసరమైన పోషకాలను అందించడం ద్వారా థైరాయిడ్ గ్రంథి పనితీరును మెరుగుపరచవచ్చు. ముఖ్యంగా చిక్కుళ్లు, బఠానీలు వంటి పప్పుధాన్యాలు ఈ సమస్యలో మేలు చేస్తాయి.

శరీరంలో ఇన్ఫ్లమేషన్‌ను తగ్గించేందుకు విటమిన్-సి అధికంగా ఉండే పండ్లు, చేపలు, ఓట్స్, రాగిజావ వంటి మిల్లెట్స్‌ను రోజువారీ ఆహారంలో భాగంగా చేసుకోవాలి. ఇవి హార్మోన్ల పనితీరును క్రమబద్ధీకరించడమే కాకుండా, సంతానోత్పత్తి సామర్థ్యాన్ని కూడా పెంచుతాయి. క్రమబద్ధమైన వ్యాయామం, సమతుల్య ఆహారం, వైద్యుల సూచనలు పాటిస్తే థైరాయిడ్ అనేది సంతాన ప్రాప్తికి అడ్డుకాదని ఆరోగ్య నిపుణులు భరోసా ఇస్తున్నారు.

Tags:    

Similar News