Vitamin D Deficiency Increase Heart Risk: విటమిన్ డి లోపిస్తే గుండెకు ప్రమాదమా..? అసలు నిజం ఏంటీ..?
అసలు నిజం ఏంటీ..?
Vitamin D Deficiency Increase Heart Risk: విటమిన్ డి అనేది ఎముకల ఆరోగ్యానికి మాత్రమే కాకుండా మొత్తం శరీర వ్యవస్థకు, ముఖ్యంగా గుండె ఆరోగ్యానికి అత్యంత అవసరమైన పోషకం. శరీరంలో విటమిన్ డి స్థాయిలు తక్కువగా ఉండటం గుండె పనితీరుపై తీవ్ర ప్రభావం చూపుతుందని, గుండెపోటు ప్రమాదాన్ని పెంచుతుందని ఒక కొత్త నివేదిక, నిపుణుల అభిప్రాయం సూచిస్తున్నాయి. విటమిన్ డి లోపం గుండెను ఎలా ప్రభావితం చేస్తుందో నిపుణులు ఇక్కడ వివరిస్తున్నారు.
విటమిన్ డి లోపం గుండెను ఎలా ప్రభావితం చేస్తుంది?
విటమిన్ డి లోపం నేరుగా గుండె జబ్బులకు కారణం కానప్పటికీ ఇది గుండె ఆరోగ్యానికి ప్రమాదకరమైన అనేక ఇతర కారకాల రిస్క్‌ను పెంచుతుంది.
రక్తపోటు పెరుగుదల
RAAS నియంత్రణ: విటమిన్ డి శరీరంలో రెనిన్-యాంజియోటెన్సిన్-ఆల్డోస్టెరాన్ వ్యవస్థను (RAAS) నియంత్రిస్తుంది. ఇది రక్తపోటు, ద్రవ సమతుల్యతను నియంత్రించే కీలకమైన హార్మోన్ల వ్యవస్థ. విటమిన్ డి స్థాయిలు తక్కువగా ఉన్నప్పుడు RAAS వ్యవస్థ సరిగా పనిచేయకపోవడం వల్ల రక్తనాళాలు కుంచించుకుపోయి..రక్తపోటు పెరుగుతుంది. అధిక రక్తపోటు గుండె జబ్బులకు ప్రధాన కారణాలలో ఒకటి.
ధమనులలో వాపు - అడ్డంకులు
విటమిన్ డి లోపం వల్ల ధమనులలో వాపు, అడ్డంకులు పెరుగుతాయి. ఈ పరిస్థితి గుండెపోటు మరియు స్ట్రోక్ వంటి తీవ్రమైన గుండె సంబంధిత సంఘటనల ప్రమాదాన్ని పెంచుతుంది.
చెడు కొలెస్ట్రాల్ పెరుగుదల
కొలెస్ట్రాల్ యొక్క సరైన జీవక్రియలో విటమిన్ డి కీలక పాత్ర పోషిస్తుంది. విటమిన్ డి స్థాయిలు తక్కువగా ఉన్నప్పుడు శరీరంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు పెరిగే అవకాశం ఉంది, ఇది గుండె ధమనుల ఆరోగ్యాన్ని మరింత దెబ్బతీస్తుంది.
ఎంత విటమిన్ డి అవసరం?
గుండెతో సహా మొత్తం ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి, శరీరానికి అవసరమైన విటమిన్ డి మోతాదును తెలుసుకోవడం ముఖ్యం..
1 నుండి 70 సంవత్సరాల మధ్య వయస్సు గలవారు 600 IU(ఇంటర్నేషనల్ యూనిట్లు)
71 ఏళ్ల కంటే ఎక్కువ వయస్సు ఉన్నవారు 800 IU ఉండాలి.
విటమిన్ డి లోపాన్ని నివారించే మార్గాలు
విటమిన్ డి స్థాయిలను సరైన స్థాయిలో నిర్వహించడం ద్వారా గుండెను కాపాడుకోవచ్చు.
సూర్యరశ్మి: ఉదయం లేదా సాయంత్రం వేళల్లో తగినంత సూర్యరశ్మిని పొందడం విటమిన్ డికి అత్యుత్తమ సహజ వనరు.
ఆహారం: విటమిన్ డి అధికంగా ఉండే చేపలు (సాల్మన్, ట్యూనా), ఫోర్టిఫైడ్ పాలు, గుడ్లలోని పచ్చసొన వంటి ఆహారాలను తీసుకోవడం. సమతుల్య ఆహారం, జీవనశైలితో పాటు, తగినంత విటమిన్ డి తీసుకోవడం ద్వారా గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.