Growing Cholesterol Crisis: భారత్‌లో తీవ్రమవుతున్న కొలెస్ట్రాల్ సంక్షోభం.. ప్రతి 10 మందిలో తొమ్మిది మందికి అసాధారణ లిపిడ్ స్థాయిలు – ICMR షాకింగ్ సర్వే..
ICMR షాకింగ్ సర్వే..
Growing Cholesterol Crisis: దేశంలో గుండెపోటు కేసులు రోజురోజుకూ పెరిగిపోవడానికి గల అసలు కారణాన్ని భారత వైద్య పరిశోధనా మండలి తాజా అధ్యయనం బట్టబయలు చేసింది. భారతదేశంలో కొలెస్ట్రాల్ సమస్య ఒక పెద్ద సంక్షోభంగా మారుతోందని ఈ నివేదిక హెచ్చరించింది. దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాలకు చెందిన 23,665 మంది వయోజనులపై జరిపిన ఈ అధ్యయనంలో.. ప్రతి 10 మంది భారతీయులలో 9 మంది అసాధారణ కొలెస్ట్రాల్ లేదా బ్లడ్ లిపిడ్స్ సమస్యతో బాధపడుతున్నట్లు తేలింది. వైద్య పరిభాషలో ఈ పరిస్థితిని డిస్లిపిడెమియా అని పిలుస్తారు. అంటే రక్తంలో కొలెస్ట్రాల్ లేదా ట్రైగ్లిజరైడ్ల స్థాయిలు ఉండాల్సిన దానికంటే చాలా ఎక్కువగా లేదా చాలా తక్కువగా ఉండటం.
30 ఏళ్ల వయసు నుంచే ముప్పు
సాధారణంగా వయసు పైబడిన వారిలోనే కొలెస్ట్రాల్ సమస్యలు వస్తాయని చాలా మంది భావిస్తారు. కానీ, భారతీయులలో ఈ అసాధారణ లిపిడ్ స్థాయిల మార్పులు వారి 30 ఏళ్ల వయసు ప్రారంభం నుంచే కనిపిస్తున్నాయని పరిశోధకులు వెల్లడించారు. ప్రారంభ దశలో ఎలాంటి స్పష్టమైన లక్షణాలు కనిపించకపోవడం వల్ల చాలా మంది దీనిని నిర్లక్ష్యం చేస్తున్నారని, ఇదే భవిష్యత్తులో ప్రాణాంతక గుండె జబ్బులకు దారితీస్తోందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
నిశ్శబ్ద శత్రువు:
అసాధారణ కొలెస్ట్రాల్ స్థాయిలు ఉన్నట్లుండి ఒక్కసారిగా సమస్యలను సృష్టించవు. కానీ కాలక్రమేణా రక్తనాళాల గోడల లోపల కొవ్వు పేరుకుపోయేలా చేస్తాయి. దీనివల్ల రక్తప్రసరణకు ఆటంకం కలిగి, రక్తనాళాలు దెబ్బతింటాయి. చివరికి ఇది గుండెపోటు, పక్షవాతం వంటి తీవ్రమైన సమస్యలకు కారణమవుతుంది.
పరిశోధనలో తేలిన మరికొన్ని కీలక విషయాలు:
మంచి కొలెస్ట్రాల్ లోపం:
చాలా మందిలో శరీరానికి రక్షణనిచ్చే మంచి కొలెస్ట్రాల్ స్థాయిలు చాలా తక్కువగా ఉన్నట్లు ఈ సర్వేలో గుర్తించారు.
ఎవరిలో ఎక్కువ?:
పురుషులతో పోలిస్తే మహిళల్లో, గ్రామీణ ప్రాంతాలతో పోలిస్తే పట్టణాల నివాసితులలో, అలాగే మధ్య భారతదేశంలో నివసించే వారిలో ఈ సమస్య ఎక్కువగా ఉన్నట్లు తేలింది.
ప్రాంతాల వారీగా:
డిస్లిపిడెమియా ప్రభావం మధ్య భారతదేశంలో అత్యధికంగా 89.1 శాతంగా నమోదు కాగా, ఈశాన్య రాష్ట్రాలలో అత్యంత తక్కువగా 85.3 శాతంగా నమోదైంది.
వైద్యుల సలహా:
కొలెస్ట్రాల్ అసాధారణ స్థాయిలను చూసి భయపడాల్సిన పనిలేదని, అయితే క్రమం తప్పకుండా స్క్రీనింగ్ చేయించుకోవడం ఎంతో ముఖ్యమని వైద్యులు సూచిస్తున్నారు. ముఖ్యంగా షుగర్, ఊబకాయం, అధిక రక్తపోటు ఉన్నవారు 30 ఏళ్లు దాటినప్పటి నుండి రెగ్యులర్‌గా కొలెస్ట్రాల్ పరీక్షలు చేయించుకోవడం ద్వారా భవిష్యత్తులో వచ్చే గుండె జబ్బుల ముప్పును ముందే నివారించవచ్చని స్పష్టం చేస్తున్నారు.