6 Hours of Sleep Enough for Good Health: ఆరోగ్యానికి 6 గంటల నిద్ర సరిపోతుందా? ఏ వయసు వారికి ఎంత నిద్ర అవసరం?
నిద్ర అవసరం?
6 Hours of Sleep Enough for Good Health: నేటి ఉరుకుల పరుగుల జీవనశైలిలో చాలామంది నిద్రకు తగినంత ప్రాధాన్యం ఇవ్వడం లేదు. రోజుకు 5 నుండి 6 గంటలు నిద్రపోతే చాలు అని సరిపెట్టుకుంటున్నారు. అయితే, సాధారణంగా పెద్దవారికి రోజుకు 6 గంటల నిద్ర చాలా తక్కువ అని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. నిద్రపోయే సమయంలోనే శరీరం అలసట నుంచి కోలుకోవడంతో పాటు, మెదడు పనితీరు చురుగ్గా మారడం, శరీర అంతర్గత వ్యవస్థలు చక్కబడటం వంటి ఎన్నో కీలక ప్రక్రియలు జరుగుతాయి. ఎక్కువ కాలం పాటు రోజుకు 6 గంటలే నిద్రపోవడం ఏమాత్రం మంచిది కాదని, దీనివల్ల రోజంతా అలసట, చిరాకు, ఏకాగ్రత లోపించడం, పని సామర్థ్యం తగ్గడం వంటి తీవ్ర సమస్యలు తలెత్తుతాయని కైలాష్ దీపక్ హాస్పిటల్ సీనియర్ కన్సల్టెంట్ డాక్టర్ గోపాల్ జీ శర్మ హెచ్చరిస్తున్నారు.
మన శరీర అభివృద్ధి, వయసును బట్టి నిద్ర అవసరాలు మారుతుంటాయి. శరీరం, మెదడు వేగంగా అభివృద్ధి చెందే దశలో ఉండే నవజాత శిశువులకు రోజుకు అత్యధికంగా 14 నుండి 17 గంటల నిద్ర అవసరం. అలాగే 4 నుండి 11 నెలల వయసున్న శిశువులు 12 నుండి 15 గంటలు, 1 నుండి 2 ఏళ్ల పిల్లలు 11 నుండి 14 గంటలు నిద్రపోవాలి. పెరుగుతున్న క్రమంలో 3 నుండి 5 ఏళ్ల పిల్లలకు 10 నుండి 13 గంటలు, 6 నుండి 12 ఏళ్ల స్కూల్ పిల్లలకు 9 నుండి 12 గంటల నిద్ర అవసరమని వైద్యులు సూచిస్తున్నారు.
ఇక యుక్తవయసులో ఉన్న 13 నుండి 17 ఏళ్ల టీనేజర్లకు రోజుకు 8 నుండి 10 గంటల విశ్రాంతి అత్యవసరం. శారీరకంగా, మానసికంగా ఎంతో ఒత్తిడిని ఎదుర్కొనే 18 నుండి 64 ఏళ్ల పెద్దలు ప్రతిరోజూ కనీసం 7 గంటలు నిద్రపోవాల్సి ఉంటుంది. అలాగే 65 ఏళ్లు పైబడిన వృద్ధులకు 7 నుండి 8 గంటల నిద్ర సరిపోతుందని నిపుణులు చెబుతున్నారు.
నిద్ర విషయంలో సమయంతో పాటు నాణ్యత కూడా అంతే ముఖ్యం. 7 నుండి 8 గంటలు పడుకున్నప్పటికీ ఉదయం లేవగానే అలసటగా అనిపించినా, రాత్రివేళల్లో మాటిమాటికీ మెలకువ వస్తున్నా లేదా నిద్రలేచాక రీఫ్రెష్‌గా అనిపించకపోయినా దానిని నాణ్యమైన నిద్రగా పరిగణించలేము. ఇలాంటి సమస్యలు నిరంతరం కొనసాగితే నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యులను సంప్రదించి పరీక్షలు చేయించుకోవడం మంచిదని ఆరోగ్య నిపుణులు సలహా ఇస్తున్నారు.