Struggling with Insomnia: నిద్రలేమితో బాధపడుతున్నారా? పడుకునే ముందు ఇలా చేస్తే హాయిగా నిద్రపోవచ్చు..
హాయిగా నిద్రపోవచ్చు..
Struggling with Insomnia: మనిషి శారీరక, మానసిక ఆరోగ్యానికి సమతుల్యాహారం, నీరు ఎంత ముఖ్యమో.. రోజూ 7 నుండి 8 గంటల పాటు ప్రశాంతమైన నిద్ర పొందడం కూడా అంతే ముఖ్యం. నిద్ర సరిగ్గా ఉంటేనే శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది, మూడ్ బాగుంటుంది, హార్మోన్ల సమతుల్యత దెబ్బతినకుండా ఉంటుంది. అయితే నేటి ఒత్తిడితో కూడిన జీవనశైలి, అలవాట్ల కారణంగా చాలామంది నిద్రలేమిసమస్యతో బాధపడుతున్నారు. మీరు కూడా రాత్రివేళ సరిగ్గా నిద్రపట్టక తీవ్ర ఇబ్బంది పడుతున్నారా? అయితే ప్రతిరోజూ రాత్రి పడుకునే ముందు ఈ చిన్న చిన్న అలవాట్లను పాటించండి. ఇవి మీకు రాత్రివేళ ప్రశాంతమైన నిద్రను అందించడంలో బాగా సహాయపడతాయి:
ఖచ్చితమైన సమయాన్ని పాటించండి
ప్రతిరోజూ ఒకే సమయానికి పడుకోవడం, ఒకే సమయానికి మేల్కోవడం అలవాటు చేసుకోండి. ఉదాహరణకు రాత్రి 9 గంటలకు పడుకుని ఉదయం 5 గంటలకు లేవడం. రోజూ ఇదే సమయాన్ని పాటించడం వల్ల శరీరంలోని బయోలాజికల్ క్లాక్ సరిగ్గా పనిచేసి, సరైన సమయానికి సహజంగానే నిద్ర వచ్చేలా చేస్తుంది.
గంట ముందు ఫోన్‌కు దూరంగా ఉండండి
రాత్రిళ్లు సోషల్ మీడియా స్క్రోల్ చేస్తూ ఆలస్యంగా పడుకోవడం చాలామందికి అలవాటుగా మారింది. కానీ మొబైల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, టీవీల నుంచి వచ్చే బ్లూ లైట్ మన శరీరంలో నిద్రను ప్రేరేపించే మెలటోనిన్ హార్మోన్ ఉత్పత్తిని దెబ్బతీస్తుంది. అందుకే పడుకోవడానికి కనీసం ఒక గంట ముందే గ్యాడ్జెట్స్‌ను పక్కన పెట్టేయాలి. ఆ సమయంలో ఏదైనా మంచి పుస్తకం చదివే అలవాటు చేసుకోవడం మంచిది.
తేలికపాటి ఆహారం తీసుకోండి
రాత్రి పడుకోవడానికి కనీసం 2 నుండి 3 గంటల ముందే రాత్రి భోజనం పూర్తి చేయాలి. రాత్రివేళల్లో ఎక్కువ ఆహారం లేదా జిడ్డుగా, కారంగా ఉండే వేపుళ్లు తింటే జీర్ణవ్యవస్థపై భారం పడి నిద్రకు భంగం కలుగుతుంది. కాబట్టి రాత్రిళ్లు తేలికగా అరిగే ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలి.
కేఫిన్, ఆల్కహాల్ వద్దే వద్దు
సాయంత్రం లేదా రాత్రి వేళల్లో టీ, కాఫీ, ఎనర్జీ డ్రింక్స్, ఆల్కహాల్ తీసుకోవడం నిద్రపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతుంది. టీ, కాఫీలలో ఉండే కేఫిన్ నిద్రను పాడుచేస్తుంది. కాబట్టి రాత్రివేళల్లో వీటిని పూర్తిగా త్యజించాలి.
ధ్యానం, ప్రశాంతమైన సంగీతం
పడుకునే ముందు 5 నుండి 10 నిమిషాల పాటు ధ్యానం లేదా లోతైన శ్వాస వ్యాయామాలు చేయడం వల్ల రోజంతా ఉన్న మానసిక ఒత్తిడి తగ్గి, మనస్సు ప్రశాంతంగా మారుతుంది. లేదా హాయిగా అనిపించే ప్రశాంతమైన సంగీతం వినడం ద్వారా కూడా మంచి నిద్రను పొందవచ్చు.