Vitamin B12 Deficiency: B12 లోపంతో నరాలు దెబ్బతినే ప్రమాదం
నరాలు దెబ్బతినే ప్రమాదం
Vitamin B12 Deficiency: శరీరంలో విటమిన్ B12 లోపం అనేది కేవలం రక్తహీనతకు మాత్రమే దారితీస్తుందని చాలామంది భావిస్తుంటారు. అయితే, రక్తహీనత లక్షణాలు ఏమాత్రం లేకపోయినప్పటికీ, సుమారు 40 శాతం మందిలో కేవలం B12 లోపం కారణంగా తీవ్రమైన నరాల వ్యాధులు వస్తున్నట్లు వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. శరీరంలో ఈ విటమిన్ స్థాయిలు పడిపోయినప్పుడు నరాల చుట్టూ ఉండే రక్షణ కవచం దెబ్బతిని, అది దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలకు దారితీస్తుందని తాజా అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి.
ముఖ్యంగా మధుమేహ వ్యాధిగ్రస్తులలో ఈ సమస్య అధికంగా కనిపిస్తోంది. చక్కెర వ్యాధి నియంత్రణ కోసం 'మెట్‌ఫార్మిన్' మందును సుదీర్ఘకాలం పాటు వాడే బాధితుల్లో దాదాపు 15 నుండి 30 శాతం మంది విటమిన్ B12 లోపానికి గురవుతున్నారు. ఈ మందు శరీరంలో విటమిన్ శోషణను అడ్డుకోవడం వల్ల బాధితులు తెలియకుండానే పోషకాహార లోపానికి లోనవుతున్నారు. అందుకే మధుమేహ బాధితులు తమ షుగర్ లెవల్స్‌తో పాటు విటమిన్ స్థాయిలను కూడా ఎప్పటికప్పుడు గమనించుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.
సాధారణంగా శరీరంలో B12 స్థాయి 200 pg/mL కంటే తగ్గితే అది ప్రమాదకరంగా మారుతుంది. ఈ స్థాయి కంటే తక్కువగా ఉన్నప్పుడు నరాలు శాశ్వతంగా దెబ్బతినే ముప్పు పొంచి ఉంది. దీనివల్ల కాళ్లు, చేతుల్లో తిమ్మిర్లు రావడం, సూదులతో గుచ్చినట్లు అనిపించడం, నడవడంలో ఇబ్బందులు కలగడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఒకసారి నరాలు తీవ్రంగా దెబ్బతింటే, ఆ తర్వాత చికిత్స అందించినా తిరిగి పాత స్థితికి తీసుకురావడం అసాధ్యమని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.
ఈ ముప్పు నుంచి తప్పించుకోవడానికి సకాలంలో వైద్య పరీక్షలు చేయించుకోవడం ఒక్కటే మార్గం. కేవలం సాధారణ B12 పరీక్షే కాకుండా, శరీరంలో లోపాన్ని కచ్చితంగా గుర్తించేందుకు , హోమోసిస్టీన్ వంటి అధునాతన పరీక్షలు చేయించుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. లోపాన్ని ముందుగానే గుర్తిస్తే మందులు లేదా ఇంజెక్షన్ల ద్వారా నష్టాన్ని నివారించవచ్చని, ఆలస్యం చేస్తే మాత్రం జరిగే నష్టాన్ని పూడ్చలేమని వారు హెచ్చరిస్తున్నారు.