Drink Too Much Water: అతిగా నీళ్లు తాగితే ఏమవుతుంది.?
ఏమవుతుంది.?;
Drink Too Much Water: అతిగా నీళ్లు తాగడం వల్ల కొన్ని ఆరోగ్య సమస్యలు వస్తాయి. దీనిని "వాటర్ ఇంటాక్సికేషన్" లేదా "ఓవర్ హైడ్రేషన్" అని అంటారు. ఇది శరీరంలో సోడియం వంటి ముఖ్యమైన ఎలక్ట్రోలైట్స్ (లవణాలు) స్థాయిలను తగ్గించి, వాటి సమతుల్యతను దెబ్బతీస్తుంది.
సాధారణంగా, మన శరీరం ఎప్పుడు నీరు అవసరమో దాహం ద్వారా తెలియజేస్తుంది. కాబట్టి దాహం వేసినప్పుడు మాత్రమే తగినంత నీరు తాగడం మంచిది. ప్రతి వ్యక్తికి నీటి అవసరం వేర్వేరుగా ఉంటుంది. వాతావరణం, శారీరక శ్రమ, ఆరోగ్యం వంటి అంశాలపై ఆధారపడి నీటి మోతాదు మారుతుంది. సాధారణంగా రోజు మొత్తం ఒకసారి కాకుండా రోజంతా 2 నుంచి 3 లీటర్ల నీరు తాగితే సరిపోతుంది. ఆరోగ్య సమస్యలను బట్టి, వైద్యుల సలహా మేరకు నీళ్లు తీసుకోవడం బెటర్.
అతిగా నీళ్లు తాగడం వల్ల వచ్చే కొన్ని ముఖ్యమైన సమస్యలు
హైపోనట్రేమియా: శరీరంలో సోడియం స్థాయిలు బాగా పడిపోతాయి. దీనివల్ల నరాలు, కండరాలు సరిగ్గా పనిచేయవు. ఈ పరిస్థితి తీవ్రమైతే తలనొప్పి, వికారం, వాంతులు, అలసట, మూర్ఛలు ,కొన్ని సందర్భాల్లో కోమాకు కూడా దారితీయవచ్చు.
మెదడు వాపు (సెరిబ్రల్ ఎడెమా): సోడియం స్థాయిలు తగ్గడం వల్ల మెదడు కణాలు ఉబ్బుతాయి. ఇది మెదడుపై ఒత్తిడిని పెంచుతుంది, ఇది చాలా ప్రమాదకరమైన పరిస్థితి.
గుండెపై ఒత్తిడి: ఎక్కువ నీరు తాగడం వల్ల రక్తం పరిమాణం (బ్లడ్ వాల్యూమ్) పెరుగుతుంది, దీనివల్ల గుండెపై అధిక ఒత్తిడి పడుతుంది. ఇది గుండె సంబంధిత సమస్యలకు దారితీయవచ్చు.
కిడ్నీల భారం: కిడ్నీలు గంటకు ఒక లీటరు వరకు మాత్రమే నీటిని ఫిల్టర్ చేయగలవు. అంతకంటే ఎక్కువ నీరు తాగితే, కిడ్నీలపై భారం పెరిగి, అవి సరిగ్గా పనిచేయలేకపోవచ్చు.
కాళ్లు, చేతులలో వాపులు: శరీరంలో నీరు ఎక్కువగా చేరడం వల్ల కాళ్లు, చేతులు, ముఖం వాపుకు గురవుతాయి.