Miscarriages Occur Repeatedly: వరుసగా గర్భస్రావాలు అవుతుంటే ఏం చేయాలి?
ఏం చేయాలి?
Miscarriages Occur Repeatedly: వరుసగా గర్భస్రావాలు కావడం అనేది దంపతులకు మానసికంగా, శారీరకంగా ఎంతో వేదన కలిగించే విషయం. అయితే, ఆధునిక వైద్యశాస్త్రం అందుబాటులోకి వచ్చిన తర్వాత ఇలాంటి సమస్యలకు పరిష్కారాలు లభిస్తున్నాయి. ఒకసారి అబార్షన్ అయితే దానిని సాధారణంగా పరిగణించినప్పటికీ, వరుసగా రెండోసారి కూడా గర్భం నిలవకపోతే మాత్రం వెంటనే అప్రమత్తం కావాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇలాంటి పరిస్థితి ఎదురైనప్పుడు స్వయంగా నిర్ణయాలు తీసుకోకుండా, అనుభవజ్ఞులైన వైద్యుల పర్యవేక్షణలో సమగ్రమైన పరీక్షలు చేయించుకోవడం ఎంతో ముఖ్యం.
గర్భస్రావం జరిగిన ప్రతిసారీ దానికి గల మూల కారణాన్ని అన్వేషించడం అవసరం. ముఖ్యంగా పిండం బలహీనంగా ఉన్నప్పుడు లేదా జన్యుపరమైన లోపాలు ఉన్నప్పుడు ప్రకృతి సిద్ధంగానే అబార్షన్ అయ్యే అవకాశం ఉంటుంది. అందుకే గర్భస్రావం జరిగినప్పుడు ఆ పిండాన్ని ల్యాబ్‌లో పరీక్షించి, భవిష్యత్తులో అవే సమస్యలు తలెత్తకుండా జాగ్రత్త పడవచ్చు. మేనరికం వివాహాలు చేసుకున్న దంపతులలో జన్యుపరమైన సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి, వారు ముందుగానే క్రోమోజోమ్ టెస్టులు చేయించుకోవడం ఉత్తమం.
వీటితో పాటు తల్లిలో ఉన్న కొన్ని ఆరోగ్య సమస్యలు కూడా గర్భస్రావాలకు కారణం కావచ్చు. గర్భాశయ నిర్మాణం సరిగ్గా లేకపోవడం, థైరాయిడ్ సమస్యలు, రక్త గడ్డకట్టే గుణం, లేదా హార్మోన్ల అసమతుల్యత వంటి వాటిని రక్త పరీక్షలు, స్కానింగ్ ద్వారా గుర్తించవచ్చు. సమస్య ఏదైనా సరే, వైద్యులు సూచించిన మందులు వాడుతూ సరైన జీవనశైలిని పాటిస్తే ఆరోగ్యకరమైన సంతానాన్ని పొందే అవకాశాలు మెండుగా ఉంటాయని వైద్య నిపుణులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.