Healthy Foods at Night: హెల్తీ ఫుడ్సే కదా అని రాత్రి వేళల్లో వీటిని తింటున్నారా? అయితే మీ ఆరోగ్యం ప్రమాదంలో పడ్డట్టే..

మీ ఆరోగ్యం ప్రమాదంలో పడ్డట్టే..

Update: 2026-06-30 13:09 GMT

Healthy Foods at Night: సాధారణంగా శరీరం ఎల్లప్పుడూ ఆరోగ్యంగా, చురుగ్గా ఉండాలంటే పోషకాలు నిండిన ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం. అయితే ఆరోగ్య నిపుణుల ప్రకారం.. ఏ ఆహార పదార్థాలు తింటున్నామనే దానితో పాటు, వాటిని ఏ సమయంలో తింటున్నాం అనేది కూడా అంతే ముఖ్యం. పగటిపూట శరీరానికి ఎంతో మేలు చేసే కొన్ని సూపర్ ఫుడ్స్, రాత్రి వేళల్లో తింటే మాత్రం రివర్స్ కొట్టి అనారోగ్యానికి దారితీస్తాయి. రాత్రి సమయంలో మన జీర్ణవ్యవస్థ పనితీరు మందగించడమే దీనికి ప్రధాన కారణం. అందుకే ఎంత ఆరోగ్యకరమైనవైనప్పటికీ రాత్రి పూట అస్సలు తీసుకోకూడని ఆ ఆహార పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.

పెరుగు

పెరుగు ఆరోగ్యానికి చాలా మంచిది, జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. కానీ, దీనిని రాత్రి పూట తీసుకోవడం అస్సలు మంచిది కాదు. పెరుగు త్వరగా జీర్ణం కాదు మరియు దీనికి శరీరంలో స్రావాలను అడ్డుకునే గుణం ఉంటుంది. రాత్రి పూట పెరుగు తినడం వల్ల శరీరంలో కఫం, పిత దోషాలు పెరిగి జలుబు, దగ్గు, ఆస్తమా, కీళ్ల నొప్పుల సమస్యలు ఎక్కువవుతాయి.

క్యారెట్, బీట్‌రూట్ జ్యూస్

చాలా మంది ఫిట్‌నెస్ కోసం రాత్రి పడుకునే ముందు క్యారెట్ లేదా బీట్‌రూట్ జ్యూస్ తాగుతుంటారు. అయితే, వీటిలో సహజ సిద్ధమైన చక్కెర శాతం చాలా ఎక్కువగా ఉంటుంది. రాత్రి పడుకునే ముందు ఈ జ్యూస్‌లు తాగడం వల్ల శరీరంలో బ్లడ్ షుగర్ లెవెల్స్ హఠాత్తుగా పెరిగే ప్రమాదం ఉంది.

మాంసాహారం

చికెన్, మటన్ వంటి మాంసాహారంలో ప్రొటీన్లు, కొవ్వులు ఎక్కువగా ఉంటాయి. ఇవి పూర్తిగా జీర్ణం కావడానికి చాలా ఎక్కువ సమయం పడుతుంది. రాత్రి ఆలస్యంగా హెవీగా నాన్-వెజ్ తినడం వల్ల కడుపు ఉబ్బరం, కడుపునొప్పి, ఎసిడిటీ వంటి సమస్యలు రావడమే కాకుండా రాత్రి నిద్రకు తీవ్ర అంతరాయం కలుగుతుంది.

ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహారాలు

మొలకెత్తిన విత్తనాలు, కొన్ని రకాల గింజలు, ఆకుకూరలు శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. కానీ వీటిలో ఉండే అధిక ఫైబర్ జీర్ణం కావడానికి జీర్ణవ్యవస్థ గంటల తరబడి శ్రమించాల్సి ఉంటుంది. రాత్రి వేళల్లో వీటిని తీసుకోవడం వల్ల గ్యాస్, కడుపులో మంట వంటి జీర్ణ సమస్యలు తలెత్తుతాయి. వీటిని ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌లో తీసుకోవడమే ఉత్తమం.

బంగాళదుంపలు

ఆలుగడ్డలలో కార్బోహైడ్రేట్లు చాలా ఎక్కువగా ఉంటాయి. ఇవి శరీరానికి తక్కువ సమయంలోనే ఎక్కువ శక్తిని అందిస్తాయి. కాబట్టి వీటిని ఉదయం లేదా మధ్యాహ్నం పూట తింటే ఆ శక్తి రోజంతా ఖర్చవుతుంది. కానీ రాత్రి పూట తింటే, ఆ క్యాలరీలు కరగక కొవ్వుగా మారి బరువు వేగంగా పెరిగేలా చేస్తాయి.

రాత్రి పూట కాఫీ, టీలు

రాత్రి పడుకునే ముందు వేడి వేడిగా కాఫీ లేదా టీ తాగే అలవాటు చాలా మందికి ఉంటుంది. కానీ వీటిలో ఉండే కెఫిన్ మెదడును ప్రేరేపించి నిద్రలేమి సమస్యకు దారితీస్తుంది. ఫలితంగా మరుసటి రోజు ఉదయం అలసటగా, నీరసంగా అనిపిస్తుంది.

నిపుణుల సూచన..

మన శరీరం రాత్రి వేళల్లో విశ్రాంతి మోడ్‌లోకి వెళ్తుంది. కాబట్టి రాత్రి భోజనాన్ని వీలైనంత వరకు సాయంత్రం 7 నుండి 8 గంటల లోపు చాలా తేలికపాటి ఆహారంతో ముగించడం మంచిది. అన్నానికి బదులుగా గోధుమ రొట్టెలు లేదా పుల్కాలు తీసుకోవడం ఉత్తమం.

Tags:    

Similar News