Dr. Manthena Satyanarayana Raju: సహజ జీవనమే ఆరోగ్యానికి శాశ్వత పునాది : మంతెన సత్యనారాయణ రాజు
మంతెన సత్యనారాయణ రాజు
Dr. Manthena Satyanarayana Raju: ప్రకృతికి అనుగుణంగా జీవించడం, సహజ ఆహారం తీసుకోవడం, తగినంత విశ్రాంతి, స్వచ్ఛమైన నీరు, గాలిని అలవాటుగా చేసుకోవడం ద్వారా సంపూర్ణ ఆరోగ్యాన్ని సాధించవచ్చని ప్రముఖ ప్రకృతి వైద్య నిపుణులు డా. మంతెన సత్యనారాయణ రాజు తెలిపారు.
ఆయుష్, టీటీడీ ఆధ్వర్యంలో తిరుపతిలోని మహతి కళాక్షేత్రంలో నిర్వహించిన “యోగ, ప్రకృతి వైద్యంతో ఆరోగ్య పరిరక్షణ” అవగాహన కార్యక్రమం ఆదివారం ఘనంగా ముగిసింది.
ఈ సందర్భంగా డా. మంతెన సత్యనారాయణ రాజు మాట్లాడుతూ, ఆధునిక జీవనశైలిలో మారుతున్న ఆహారపు అలవాట్లు, శారీరక శ్రమ లోపించడం, తగినంత విశ్రాంతి లేకపోవడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని తెలిపారు. సహజ ఆహారం, స్వచ్ఛమైన నీరు, స్వచ్ఛమైన గాలి, తగినంత విశ్రాంతి ఆరోగ్య సంజీవినిలోని నాలుగు ముఖ్య అంశాలని పేర్కొన్నారు. ఆరోగ్యంపై ముందుగానే శ్రద్ధ వహించి మంచి జీవన అలవాట్లు పాటిస్తే అనేక అనారోగ్య సమస్యలకు దూరంగా ఉండవచ్చన్నారు.
శారీరక ఆరోగ్యంతో పాటు భావోద్వేగ ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవడం అత్యంత అవసరమని బెటర్ లివింగ్ సైన్స్, టెక్నాలజీ అండ్ డిజిటల్ వెల్‌నెస్ వైస్ ప్రెసిడెంట్ శ్రీ బాలకృష్ణ తెలిపారు.
వేగవంతమైన జీవనశైలిలో ఒత్తిడి, ఆందోళన, కోపం, నిరాశ వంటి భావోద్వేగాలను సమతుల్యంగా నిర్వహించుకోవాలని సూచించారు. సానుకూల ఆలోచనలు.. ప్రశాంతమైన మనసు.. ఆనందమయ జీవితంకు బలమైన పునాదులని చెప్పారు.
ప్రతిరోజూ కొంత సమయం యోగా, ధ్యానం, వ్యాయామానికి కేటాయించడంతో పాటు ప్రకృతితో మమేకం కావాలని, కుటుంబ సభ్యులు, స్నేహితులతో ఆప్యాయంగా గడపాలని సూచించారు. సమస్యలను చూసి ఆందోళన చెందకుండా పరిష్కార మార్గాలపై దృష్టి పెట్టడం ద్వారా ఆత్మవిశ్వాసం, మానసిక ప్రశాంతత పెంపొందుతాయని తెలిపారు.
సాంకేతికత మన జీవితంలో అంతర్భాగంగా మారిన నేపథ్యంలో మొబైల్ ఫోన్, సోషల్ మీడియా, డిజిటల్ పరికరాల వినియోగంలో సమతుల్యత పాటించాలని శ్రీ బాలకృష్ణ సూచించారు. అవసరానికి మించి డిజిటల్ పరికరాలకు సమయం కేటాయించకుండా కుటుంబం, ప్రకృతి, వ్యాయామం, ఆధ్యాత్మిక చింతనకు సమయం ఇవ్వాలని తెలిపారు.
శారీరక ఆరోగ్యం – భావోద్వేగ సమతుల్యత – డిజిటల్ వెల్‌నెస్ ఈ మూడింటినీ సమన్వయం చేసుకున్నప్పుడే ఆరోగ్యకరమైన, ప్రశాంతమైన, ఆనందమయ జీవితాన్ని గడపగలమని ఆయన పేర్కొన్నారు.