Skip Detox Drinks After Dinner: రాత్రి భోజనం తర్వాత డిటాక్స్ డ్రింక్స్ వద్దు..ఈ చిన్న పని చేయండి చాలు!

ఈ చిన్న పని చేయండి చాలు!

Update: 2026-07-17 05:50 GMT

Skip Detox Drinks After Dinner: ప్రస్తుత కాలంలో చాలా మంది కడుపు ఉబ్బరం, గ్యాస్, ఎసిడిటీ వంటి జీర్ణ వ్యవస్థ సమస్యల కోసం ఖరీదైన మందులు, మార్కెట్లో దొరికే రకరకాల డిటాక్స్ డ్రింక్స్ వాడుతుంటారు. కానీ, ప్రముఖ జీర్ణకోశ నిపుణుల ప్రకారం... వాటన్నింటికంటే సులభమైన, రూపాయి ఖర్చు లేని ఒక అద్భుతమైన అలవాటు ఉంది. అదే రాత్రి భోజనం చేశాక కాసేపు నడవడం!

భోజనం చేసిన తర్వాత చాలా మంది కడుపు ఉబ్బరంగా ఉందనో లేదా గ్యాస్ వల్ల ఇబ్బందిగా ఉందనో బాధపడుతుంటారు. దీనికి రాత్రి పూట వేసే చిన్న నడకే బెస్ట్ మందు. తిన్న తర్వాత నెమ్మదిగా నడవడం వల్ల మనం తిన్న ఆహారం కడుపులో నుండి ప్రేగుల్లోకి త్వరగా, సులభంగా వెళ్తుంది. ఇది జీర్ణవ్యవస్థలోని కండరాలను ఉత్తేజపరుస్తుంది. ఫలితంగా కడుపు ఉబ్బరం, యాసిడ్ రిఫ్లక్స్ (గుండెల్లో మంట), మలబద్ధకం వంటి సమస్యలు సహజంగానే తగ్గుముఖం పడతాయి.

ఈ చిన్న అలవాటు కేవలం జీర్ణక్రియకే కాదు.. బ్లడ్ షుగర్ లెవెల్స్‌ను కంట్రోల్ చేయడంలోనూ అద్భుతంగా పనిచేస్తుంది. మనం భోజనం చేసిన 30 నిమిషాల లోపు రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు వేగంగా పెరుగుతాయి. ఆ సమయంలో ఒక 10 నుండి 15 నిమిషాల పాటు తేలికపాటి నడక (Light Walk) చేయడం వల్ల.. శరీరంలోని కండరాలు ఆ గ్లూకోజ్‌ను శక్తిగా మార్చేస్తాయి. దీనివల్ల ఇన్సులిన్ పై ఒత్తిడి తగ్గి, తిన్న తర్వాత వచ్చే షుగర్ స్పైక్స్ (Blood Sugar Spikes) చాలా వరకు అదుపులో ఉంటాయి.

చాలా మంది తిన్న వెంటనే భారంగా అనిపించి బెడ్‌పై వాలిపోతారు లేదా సోఫాలో కూర్చుండిపోతారు. కానీ ఆ సమయంలో పొట్ట చుట్టూ కొవ్వు చేరకుండా ఉండాలన్నా, తిన్న ఆహారం సక్రమంగా అరిగి రాత్రి వేళ హాయిగా నిద్రపట్టాలన్నా నడక ఎంతో అవసరం. అయితే ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే.. తిన్న వెంటనే వేగంగా (Brisk Walk) నడవకూడదు. చాలా సాధారణ వేగంతో, ప్రశాంతంగా నడవడం మాత్రమే జీర్ణవ్యవస్థకు మేలు చేస్తుంది.

Tags:    

Similar News