Another Hindu Murder in Bangladesh: బంగ్లాదేశ్‌లో మరో హిందువు హత్య.. 24 గంటల్లో రెండో ఘటన
24 గంటల్లో రెండో ఘటన
Another Hindu Murder in Bangladesh: బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడులు ఆగడం లేదు. మణి చక్రవర్తి అనే కిరాణా దుకాణ వ్యాపారిని గుర్తుతెలియని దుండగులు పదునైన ఆయుధాలతో దాడి చేసి హత్య చేశారు. ఇది గత 24 గంటల్లో రెండో హిందువు హత్య ఘటన కావడం ఆందోళన కలిగిస్తోంది.
నర్సింగ్డి జిల్లాలోని చార్‌సిందూర్ బజార్‌లో ఈ దారుణం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం, మణి చక్రవర్తి తన కిరాణా దుకాణాన్ని నడుపుతున్నాడు. సోమవారం రాత్రి దుకాణంలో ఉండగా, కొందరు దుండగులు షాపులోకి చొరబడి పదునైన ఆయుధాలతో అతనిపై దాడి చేశారు. దీంతో తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే ఆస్పత్రికి తరలించగా, అప్పటికే అతడు ప్రాణాలు కోల్పోయాడు.
మణి చక్రవర్తి చాలా మంచి వ్యాపారి అని, ఎవరితోనూ విభేదాలు లేవని తోటి వ్యాపారులు తెలిపారు. ఇలాంటి ఘటనలు తరచూ జరుగుతుండటంతో హిందువులు భయాందోళనకు గురవుతున్నారు. బాధ్యులను వెంటనే అరెస్టు చేసి కఠిన శిక్షలు విధించాలని డిమాండ్ చేస్తున్నారు.
ఇంతకుముందు రాణాప్రతాప్ బైరాగి అనే జర్నలిస్టు హత్యకు గురయ్యాడు. ఈ రెండు ఘటనలు కొన్ని గంటల వ్యవధిలోనే జరగడం ఆందోళనకు గురిచేస్తోంది.
విద్యార్థి నాయకుడు ఉస్మాన్ హాదీ హత్యతో దేశంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అప్పటి నుంచి హిందువులపై దాడులు కొనసాగుతున్నాయి. గత 18 రోజుల్లో ఆరుగురు హిందువులు హత్యకు గురవడం ఆందోళన కలిగిస్తోంది.