Pakistan’s Fake Team: పాక్‌ నకిలీ జట్టు.. ఆడేందుకు కాదు, చొరబడేందుకు వచ్చింది

చొరబడేందుకు వచ్చింది

Update: 2025-09-17 15:29 GMT

Pakistan’s Fake Team: పాకిస్థాన్‌ నుంచి ప్రొఫెషనల్ ఫుట్‌బాల్ జట్టు పేరుతో జపాన్‌లోకి అక్రమంగా ప్రవేశించేందుకు ప్రయత్నించిన 22 మంది వ్యక్తులను జపాన్ అధికారులు విమానాశ్రయం నుంచే డిపోర్ట్‌ చేశారు. అంతర్జాతీయ మీడియా సమాచారం ప్రకారం, జపాన్‌లో జరుగుతున్న ఫుట్‌బాల్‌ టోర్నమెంట్‌లో పాల్గొనేందుకు వచ్చినట్లు చెప్పుకున్న ఈ బృందం, పాకిస్థాన్‌ విదేశాంగ మంత్రిత్వ శాఖ జారీ చేసిన నకిలీ నో-అబ్జెక్షన్ సర్టిఫికెట్లతో జపాన్‌ చేరుకుంది.

విమానాశ్రయంలో ఇమ్మిగ్రేషన్‌ అధికారులకు అనుమానం రావడంతో నిర్వహించిన దర్యాప్తులో వీరు నకిలీ జట్టుగా గుర్తించబడ్డారు. దీంతో వారిని వెనక్కి పంపేశారు. పాకిస్థాన్‌ విమానాశ్రయ అధికారులను ఈ బృందం ఎలా తప్పించుకుందనే దానిపై స్పష్టత అవసరమని అధికారులు పేర్కొన్నారు. సియాల్‌కోట్‌కు చెందిన మాలిక్ వకాస్ అనే వ్యక్తి ఈ అక్రమ రవాణా పథకాన్ని రూపొందించినట్లు తెలుస్తోంది. గుజ్రాన్‌వాలాలో ఎఫ్‌ఐఏ అధికారులు అతడిని అరెస్టు చేసి కేసు నమోదు చేశారు.

వకాస్ ‘గోల్డెన్ ఫుట్‌బాల్ ట్రయల్’ అనే నకిలీ ఫుట్‌బాల్ క్లబ్‌ స్థాపించి, 22 మంది నుంచి జపాన్‌కు పంపేందుకు కోటి రూపాయలకు పైగా వసూలు చేశాడని అధికారులు తెలిపారు. ఇది మొదటిసారి కాదని, 2024లో కూడా నకిలీ పత్రాలతో 17 మందిని జపాన్‌కు అక్రమంగా పంపినట్లు వెల్లడించారు.

Tags:    

Similar News