H-1B Visa Fees: అమెరికాలో ప్రాజెక్ట్ ఫైర్‌వాల్ ప్రారంభం.. H-1B వీసా ఫీజు భారీగా పెంపు.. టెకీలకు ఇక నిద్ర కరువా?

H-1B వీసా ఫీజు భారీగా పెంపు.. టెకీలకు ఇక నిద్ర కరువా?

Update: 2025-09-20 15:51 GMT

H-1B Visa Fees: అమెరికాలో H-1B వీసాపై పనిచేస్తున్న ఉద్యోగుల కోసం కంపెనీలు ప్రతి ఏటా లక్ష డాలర్లు చెల్లించాలనే ట్రంప్ ప్రభుత్వ నిర్ణయం తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ నిర్ణయంపై అమెరికా కార్మిక శాఖ హర్షం వ్యక్తం చేసింది. ప్రాజెక్ట్ ఫైర్‌వాల్‌ను అమెరికాలో అమల్లోకి తెస్తున్నామని, H-1B వీసాపై తాజా నిర్ణయం కూడా దాని భాగమేనని కార్మిక శాఖ వెల్లడించింది.

H-1B వీసా దుర్వినియోగానికి అడ్డుకట్ట వేసి, నైపుణ్యం కలిగిన అభ్యర్థులకు మాత్రమే కంపెనీలు ప్రాధాన్యత ఇవ్వాలనే లక్ష్యంతో H-1B వీసా అప్లికేషన్లపై లక్ష డాలర్ల ఫీజు ఆదేశాలు జారీ చేశారు. H-1B వీసా దుర్వినియోగం కారణంగా అమెరికన్ పౌరులు దీర్ఘకాలం ఉద్యోగాలు కోల్పోయారని, ఇకపై నైపుణ్యం కలిగిన అమెరికన్లకు అలాంటి పరిస్థితి ఎదుర్కాకూడదని కార్మిక శాఖ కార్యదర్శి లోరీ చావెజ్-డిరెమెర్ తెలిపారు.

అమెరికా కార్మిక శాఖ చెప్పిన ప్రాజెక్ట్ ఫైర్‌వాల్ అంటే ఏమిటంటే, అమెరికాలో హై-స్కిల్డ్ ఉద్యోగాలు అమెరికన్ పౌరులకే దక్కాలనే లక్ష్యంతో అమలు చేస్తున్న ప్రణాళిక. ప్రముఖ కంపెనీలు, ముఖ్యంగా టెక్ కంపెనీలు నియామకాల్లో అర్హత కలిగిన అమెరికన్లకు ప్రాధాన్యత ఇవ్వాలనే ఉద్దేశంతో ట్రంప్ ప్రభుత్వం ఈ ప్లాన్‌ను అమలు చేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా H-1B వీసాపై పనిచేస్తున్న ఉద్యోగులపై అధికార యంత్రాంగం దృష్టి సారించింది. H-1B వీసా దుర్వినియోగాన్ని నియంత్రించాలనే లక్ష్యంతో కార్మిక శాఖ కార్యదర్శి వ్యక్తిగతంగా H-1B ప్రక్రియను పరిశీలిస్తున్నారు.

H-1B వీసా దరఖాస్తు సమయంలో లేదా ఉద్యోగిని నియమించుకున్నప్పుడు ఏవైనా అవకతవకలు జరిగాయని తేలితే, సంబంధిత కంపెనీపై, ఉద్యోగిపై భారీ జరిమానా విధించడంతో పాటు H-1B వీసా నిషేధం విధించాలనే ఉద్దేశం. తద్వారా అమెరికాలో నైపుణ్యం కలిగిన స్థానికులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం లక్ష్యంగా ఈ ప్రాజెక్ట్‌కు శ్రీకారం చుట్టారు. ఫలితంగా H-1B వీసాపై ఏటా లక్ష డాలర్లు చెల్లించాలనే ఉత్తర్వులు జారీ చేశారు.

Tags:    

Similar News