Children in Pakistan ISI Network: పాక్ ఐఎస్‌ఐ గాలంలో చిన్నారులు.. పంజాబ్‌లో 15 ఏళ్ల బాలుడు అరెస్ట్‌

పంజాబ్‌లో 15 ఏళ్ల బాలుడు అరెస్ట్‌

Update: 2026-01-06 09:55 GMT

Children in Pakistan ISI Network: పాకిస్తాన్ నిఘా సంస్థ ఐఎస్‌ఐ ఇప్పుడు భారతీయ చిన్నారులను లక్ష్యంగా చేసుకుంటోంది. దేశ భద్రతకు సంబంధించిన సున్నిత సమాచారాన్ని సేకరించేందుకు మైనర్లను పావులుగా వాడుకుంటూ గూఢచర్య నెట్‌వర్క్‌ను విస్తరిస్తోంది. ఈ నేపథ్యంలో పంజాబ్‌లోని పఠాన్‌కోట్ పోలీసులు 15 ఏళ్ల బాలుడిని అరెస్టు చేశారు. జమ్మూ సాంబా జిల్లాకు చెందిన ఈ మైనర్ గత ఏడాది కాలంగా పాక్ ఐఎస్‌ఐ ఏజెంట్లతో సంపర్కంలో ఉంటూ భారత సైనిక స్థావరాలు, రక్షణ ఏర్పాట్లకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు లీక్ చేసినట్లు దర్యాప్తులో వెల్లడైంది.

సోషల్ మీడియా ద్వారా నకిలీ ఖాతాలతో యువతను ఆకర్షించి, భావోద్వేగాలను ఉపయోగించుకుని ఐఎస్‌ఐ హ్యాండ్లర్లు ఈ బాలుడిని ట్రాప్‌లోకి లాగారు. అతడు ఒక్కడే కాదు.. పంజాబ్‌లోని వివిధ జిల్లాలకు చెందిన మరికొందరు మైనర్లు కూడా పాక్ ఏజెంట్లతో టచ్‌లో ఉన్నట్లు పోలీసుల అనుమానం. దీంతో రాష్ట్రవ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్లకు అలర్ట్ జారీ చేశారు. మైనర్ల ఆన్‌లైన్ కార్యకలాపాలు, కదలికలపై కొనసాగుతున్న నిఘాను మరింత బలోపేతం చేశారు.

పఠాన్‌కోట్ ఎస్‌ఎస్‌పీ దల్జీందర్ సింగ్ ధిల్లాన్ మాట్లాడుతూ.. ‘‘అరెస్టయిన బాలుడు పాకిస్తాన్‌లోని ఐఎస్‌ఐ, ఉగ్ర సంస్థలతో సంబంధాలు పెట్టుకుని దేశ భద్రతకు సంబంధించిన సమాచారాన్ని పంచుతున్నాడు. దర్యాప్తు కొనసాగుతోంది’’ అని తెలిపారు. ఈ ఘటన దేశ భద్రతపై కొత్త రకం ముప్పును ఎత్తిచూపుతోంది. యువతను అస్థిరపరచేందుకు, భారత వ్యతిరేక భావాలను రెచ్చగొట్టేందుకు పాక్ నిఘా సంస్థ కొత్త వ్యూహాలు అమలు చేస్తోందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Tags:    

Similar News