Fake Colgate, Adulterated Maggi: నకిలీ కోల్‌గేట్, కల్తీ మ్యాగీ, ఫేక్ ఈనో ఫ్యాక్టరీలు గుజరాత్‌లో బహిర్గతం – అసలైనవి ఏవి?

గుజరాత్‌లో బహిర్గతం – అసలైనవి ఏవి?

Update: 2025-10-13 11:57 GMT

Fake Colgate, Adulterated Maggi: మార్కెట్‌లో ఏది అసలైనది, ఏది నకిలీ అని గుర్తుపట్టడం కష్టమవుతోంది. బ్రాండెడ్ ఉత్పత్తులను అచ్చంగా అనుకరించి, కల్తీ వస్తువులను తయారుచేసి విక్రయిస్తున్నారు మోసగాళ్లు. ఒరిజినల్ లేబుల్స్, ప్యాకేజింగ్‌ను కాపీ చేసి మార్కెట్‌ను ముంచేస్తున్నారు. కోల్‌గేట్ టూత్‌పేస్ట్, మ్యాగీ నూడుల్స్, ఈనో యాంటాసిడ్ లాంటి ప్రసిద్ధ బ్రాండ్లను నకిలీగా తయారుచేసే ఫ్యాక్టరీలు గుజరాత్‌లో ఏర్పాటు చేసి, దేశవ్యాప్తంగా సరఫరా చేస్తున్నారు. ఈ మోసం బయటపడటంతో దేశమంతా ఆందోళనకు గురవుతోంది. ప్రజలు తాము ఉపయోగిస్తున్న వస్తువులపై సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ కల్తీ రాకెట్ వివరాలు తెలిస్తే ఎవరైనా షాక్ అవుతారు.

గుజరాత్‌లోని కచ్ జిల్లాలో భారీ మొత్తంలో నకిలీ కోల్‌గేట్ టూత్‌పేస్ట్ తయారీ ఫ్యాక్టరీని పోలీసులు ధ్వంసం చేశారు. ఇది దేశంలో నకిలీ ఉత్పత్తుల సమస్యను మరింత తీవ్రతరం చేసింది. ఈ ఫ్యాక్టరీలో అసలు కోల్‌గేట్‌లా కనిపించే నకిలీ పేస్ట్‌ను ఉత్పత్తి చేస్తున్నారు. ఈ కేసులో రాజేష్ మక్వానా అనే వ్యక్తిని అరెస్టు చేశారు పోలీసులు.

కొన్ని రోజుల క్రితం ఢిల్లీలో నకిలీ సెన్సోడైన్ టూత్‌పేస్ట్, ఫేక్ ఈనో, నకిలీ గోల్డ్ ఫ్లేక్ సిగరెట్లు తయారుచేసే గ్యాంగ్‌ను పట్టుకున్నారు. టూత్‌పేస్ట్, మెడిసిన్ లాంటి రోజువారీ వస్తువులు కూడా నకిలీ అవుతుంటే, మనం ఏమి నమ్మాలి? ఇవి సాధారణ మోసాలు కాదు, తెలియకుండా వాడే నిత్యావసరాలలో విషం లాంటివి అంటూ సోషల్ మీడియాలో చర్చలు జరుగుతున్నాయి.

నిందితులు చవకైన, నాణ్యతలేని ముడి పదార్థాలతో నకిలీ టూత్‌పేస్ట్ తయారుచేసి, అసలు కోల్‌గేట్‌గా మార్కెట్‌లో అమ్ముతున్నారు. పోలీసులు రూ.9.43 లక్షల విలువైన నకిలీ పేస్ట్, ప్యాకేజింగ్ సామగ్రి, తయారీ యంత్రాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ నకిలీ వస్తువులు ఎక్కడికి సప్లై అయ్యాయి, ఎవరు పంపిణీ చేశారు అనేది ఇప్పుడు దర్యాప్తు చేస్తున్నారు.

ఇలాంటి సంఘటనలు ఒకటి రెండు కాదు. 2025 జూలైలో సూరత్ పోలీసులు చాముండా ఇండస్ట్రియల్ ఎస్టేట్‌లో నకిలీ మసాలాల ఫ్యాక్టరీని బస్ట్ చేసి, నకిలీ మ్యాగీ, ఎవరెస్ట్ మసాలాలు తయారుచేసిన ఐదుగురిని అరెస్టు చేశారు. అలాగే ఆగస్టులో ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ నకిలీ ఈనో, సెన్సోడైన్ టూత్‌పేస్ట్, సిగరెట్లు తయారుచేసే పెద్ద రాకెట్‌ను పట్టుకుంది.

నకిలీ ఉత్పత్తుల వాడకం ఆరోగ్యానికి తీవ్ర ప్రమాదం అంటున్నారు నిపుణులు. కల్తీ యాంటాసిడ్‌లో హానికర రసాయనాలు లేదా తప్పుడు డోసులు ఉండటం వల్ల కడుపు మంట, యాసిడ్ రిఫ్లక్స్, అలర్జీలు రావచ్చు. నకిలీ టూత్‌పేస్ట్‌లో విషపూరిత పదార్థాలు ఉండటం వల్ల పళ్లు, చిగుళ్లు దెబ్బతినవచ్చు. నకిలీ సిగరెట్లలో అసురక్షిత పొగాకు మిశ్రమాలు ఉండటం వల్ల ఊపిరితిత్తులు, హార్ట్ సమస్యలు పెరుగుతాయి.

రోజువారీ వస్తువులలో కూడా నకిలీవి చొరబడుతున్న నేపథ్యంలో, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు పోలీసులు. నమ్మకమైన దుకాణాల నుంచి మాత్రమే కొనుగోలు చేయాలి. కొనేముందు ప్యాకేజింగ్ వివరాలు, లేబుల్స్ సరిగా పరిశీలించి, అసలైనదో కాదో నిర్ధారించుకోవాలి. ఇలాంటి మోసాలు మరిన్ని బయటపడేలా అధికారులు మరింత కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

Tags:    

Similar News