Govt of India: రష్యా సైన్యంలో చేరికపై కేంద్రం అలర్ట్ – జాగ్రత్తగా ఉండండి!
జాగ్రత్తగా ఉండండి!
Govt of India: ఉక్రెయిన్‌తో జరుగుతున్న యుద్ధంలో రష్యా సైన్యం తరఫున కొందరు భారతీయులు పనిచేస్తున్నట్లు వార్తలు వెలుగులోకి వచ్చాయి. ఈ విషయం కేంద్ర ప్రభుత్వం దృష్టికి రావడంతో, విదేశాంగ శాఖ గురువారం ఈ అంశంపై స్పందించింది. రష్యా సైన్యంలో చేరేందుకు ఇచ్చే ఆఫర్లు ప్రమాదకరమని, వాటికి దూరంగా ఉండాలని హెచ్చరించింది.
విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైశ్వాల్ మాట్లాడుతూ, "రష్యా సైన్యంలో భారతీయ పౌరులను నియమించుకుంటున్నట్లు నివేదికలు మా దృష్టికి వచ్చాయి. ఈ నియామకాలు ప్రమాదకరమైనవని, రష్యా సైన్యంతో పనిచేయడం వల్ల కలిగే రిస్క్‌ల గురించి గతంలోనూ పలుమార్లు హెచ్చరించాం. ఈ ఆఫర్లకు దూరంగా ఉండాలని, రష్యా సైన్యంలో చేరవద్దని మరోసారి సూచిస్తున్నాం. అక్కడ పనిచేస్తున్న భారతీయులను స్వదేశానికి తిరిగి పంపాలని రష్యా అధికారులతో చర్చలు జరుపుతున్నాం. బాధిత కుటుంబాలతోనూ సంప్రదింపులు చేస్తున్నాం" అని తెలిపారు.
ఉక్రెయిన్‌లోని దొనెట్స్క్ ప్రాంతంలో ఇద్దరు భారతీయులు, నిర్మాణ పనుల సాకుతో తమను రష్యాకు తీసుకెళ్లి యుద్ధంలో మోహరించారని ఆరోపించారు. వారు స్టూడెంట్ లేదా విజిటర్ వీసాపై రష్యాకు వెళ్లినట్లు సమాచారం. ఈ విషయం వెలుగులోకి రావడంతో కేంద్రం వెంటనే స్పందించి, ఈ అంశాన్ని దిల్లీ మరియు మాస్కోలోని రష్యా అధికారుల దృష్టికి తీసుకెళ్లింది. గతంలో కూడా ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించిన కేంద్రం, అక్కడ ఉన్న భారతీయులను స్వదేశానికి రప్పించేందుకు రష్యా ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చింది. గత ఏడాది రష్యా పర్యటన సందర్భంగా ప్రధాని మోదీ ఈ అంశంపై పుతిన్‌తో చర్చించిన విషయం తెలిసిందే.